పుట:భాస్కరరామాయణము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నతండును నధికసంభ్రమంబున నొక్కయుత్తాలపాదపశిఖారోహణంబు సేసి
యుత్తరపథంబునం జతురంగబలాకీర్ణం బగుమహాసైన్యంబు గనుంగొని మఱియు
నేర్పడం బరికించి.

252

భరతుఁడు చిత్రకూటంబున కరుగుదెంచుట

చ.

తరణికులప్రధానబిరుదధ్వజపంక్తులఁ జూచి సేనతో
భరతుఁడు దాడి పెట్టి తముఁ బట్టఁగ వచ్చుటఁ గాఁ దలంచి ని
ష్ఠురగతి లక్ష్మణుండు ఘనచుంబిమహీరుహశాఖనుండి య
గ్గిరి యగలంగ డిగ్గ నుఱికెం గులిశాతతపాతమో యనన్.

253


వ.

ఇ ట్లుఱికి యోరామచంద్రా భరతుండు సేనాసమేతుం డయి మనమీఁద వచ్చు
చున్నాఁడు నీవుం గవచంబు ధరియించి బాణాసనసన్నద్ధుండవు గమ్ము కాదేని
వైదేహిం దోడ్కొని గిరిగహ్వరాంతరంబున కరుగుము నీశాంతియ ని న్నింత
చేసె నింక సైరింప నతని ప్రాణంబులు గొందు ననిన విని రాఘవేశ్వరుండు
కోపించి నాకుఁ దమ్ముండ వై యుండియు నింతవినయశూన్యుండ వై నీచోక్తు
లేల యాడెదవు నీకంటె వాఁడు నాకు భ క్తుండు మనల నయోధ్యకుఁ గొనిపోవు
తలంపున వచ్చువాఁ డయ్యుత్తమునిచిత్తవృత్తి యెఱుంగవు సంభ్రమం బుడుగు
మనిన నమ్మాటలకు వెఱచి సుమిత్రాపుత్రుండు లజ్జావనతవదనుం డయి యుండె
నాసమయంబున.

254


తే.

దూరమున సేన నిల్పి శత్రుఘ్నుతోడఁ
బాదచారి యై చనుదెంచి పర్ణశాలఁ
గాంచి భరతుండు విపులశోకమునఁ దనదు
హృదయ మెరియుచు నుండంగ నిట్టు లనియె.

255


సీ.

మహనీయమణిమయమందిరంబుల నుండు, ప్రభుఁడు నేఁ డున్నాఁడు పర్ణశాల
మెత్తనిపాన్పున మే నొత్తుసుఖి నేఁడు, తనువు సేర్చినవాఁడు దర్భశయ్య
లలితమాల్యంబులు లలిఁ బూనుపతి నేఁడు వలనొప్పఁ గయికొన్నవాఁడు జడలు
మృదులాంబరంబుల మెఱయుపుణ్యుఁడు నేఁడు, వలనొప్పఁ గట్టెను వల్కలములు
కోరి రాజన్యలోకంబుఁ గొల్చు రాజ, మౌళిమణి నేఁడు మునిసేవ మరగినాఁడు
వలసె నా కిప్పు డీదురవస్థ చూడఁ, గైకకడుపునఁ బుట్టిన కారణమున.

256


వ.

అనుచుఁ బర్ణశాల సేరం జనుదెంచి రామునిం గని తదంఘ్రిపురోభాగంబున
ననుజసమేతుం డయి దండప్రణామంబులు సేసిన నారఘుపుంగవుండు నక్కుమా
రయుగళంబునుం గ్రుచ్చి యెత్తి యక్కునఁ జేర్చి యాలింగనంబు సేసి గారవించెఁ
బదంపడి.

257


క.

జనకజకు సుమిత్రానం, దనునకుఁ బ్రణమిల్లి సముచితస్థితి దర్భా
సనముల నుండఁగ రఘుపతి, యనుజన్ములఁ జూచి సేమ మారాజునకున్.

258