పుట:భాస్కరరామాయణము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱునాఁడు సకలమునులను రాజులను రప్పించి వసిష్ఠుం బురస్కరించుకొని దశ
రథేశ్వరునికళేబరంబు దివ్యాంబరాభరణగంధమాల్యంబుల నలంకరించి కోటి
సంఖ్యాకంబు లగుమహిషగోగజాశ్వాదిదానంబు లొనర్చి సువర్ణవిమానంబునం
బెట్టుకొని యారాజశవంబుపిఱుందం గౌసల్యాదికాంత లాక్రందనంబు సేయుచుం
జనుదేర ముందట నగ్నిహోత్రాగ్నిఁ గొని భరతుండు వసిష్ఠాదిపురోహితులు
తోడం గూడిరా శత్రుఘ్నసమేతుం డయి నడచి యయోధ్యానగరంబు వెడలి
సరయూతటంబున సొద పేర్చి యం దారాజశవ మిడి త్రేతాగ్నుల నయ్యయి
ముత్రంబుల విహితావయవంబులఁ బెట్టి స్రుక్స్రువాదియజ్ఞాంగంబుల నర్హాంగ
కంబులఁ జేర్చి వేదోక్తమార్గంబున దహించి తిలోదకదానం బాచరించి నగరి
కేతెంచి విహితద్వాదశాహకృత్యంబులు నిర్వర్తించి కృతకత్యుం డయ్యె నంత
ననంతరదివసంబున.

237


తే.

సకలనృపమంత్రిమునిలోకసమ్మతమున
భరతుఁ గనుఁగొని రఘువంశగురుఁడు రాష్ట్ర
మి ట్లరాజక మై యున్న నెగ్గు దొడరుఁ
గాన నీ వింకఁ బట్టంబు గట్టికొనుము.

238


చ.

అనవుడు సైఁప కి ట్లనియె నక్కట ప్రాకృతుఁ డాడునట్టు లో
మునివర నీవు మత్కులసముజ్జ్వలధర్మముఁ జూడ కాడె దే
మనీ విననేర్తు వీఁ డల దురాత్మకురా లగుకైకనందనుం
డనునది దక్క నాదుమన మారసి యొండొకతప్పు చెప్పుమా.

239


శా.

రాముం బుణ్యగుణాభిరాము నెలమిం బ్రార్థించి తో డ్తెచ్చి ది
క్సీమాతిక్రమణక్షమాన్వయలసత్కీర్తుల్ వెలుంగొంద ను
ద్దామశ్రీ కభిషిక్తుఁ జేయుదు రఘూత్తంసంబు రాకున్న నా
భూమిశాగ్రణిఁ గొల్చి నిల్తు నటవీభూమిం దపోవేషి నై.

240


వ.

అని పలుక సభాసదులు శిరఃకంపంబు సేయ నక్కుమారుండు.

241


ఉ.

మాతలు మూవురున్ సకలమంత్రులుఁ బార్థివులుం బురోహిత
వ్రాతము నవ్వసిష్ఠమునివర్యుఁడు దమ్ముఁడుఁ దోడ రా గజా
శ్వాతతసర్వసైన్యయుతుఁడై పురి వెల్వడి యేఁగుదెంచి గం
గాతటి నీతటిన్ విడియఁగా భరతుం డనువార్త మోసినన్.

242


వ.

విని గుహుండు సంభ్రమంబున శృంగిబేరపురంబు వెల్వడి తత్సైన్యంబు గనుంగొని.

243


సీ.

క్రూరతఁ గైకేయికొడు కట్లు తమతల్లి, చేసినయది మున్ను చెల్లెఁ గాన
యంతనె యుండ కి ట్లారాజపరమేశు, పై నెత్తిపోయెడిఁ బాపచింత
ననుబుద్ధిఁ దనసైన్య మాయితమై యుండఁ, గావించి రేవులు గట్టఁ బనిచి
యేతెంచి భరతుతో నిట్లని పలికె న, క్కట మహారాజ్యభోగములు విడిచి