పుట:భాస్కరరామాయణము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లుగా నలువురుమంత్రులం బిలిచి మీరు వస్త్రాభరణంబులు గైకొని గిరివ్రజపు
రంబున కరిగి భరతుం దోడ్కొని రండని నియోగించిన వారును నయోధ్య వె
డలి యేడవరాత్రి నక్కేకయరాజునగరంబు సొచ్చి రంతకు మున్న సముద్రం
బింకిపోవను జంద్రమండలంబు నేలం బడియుండనుం గలగని యాదుస్స్వప్నం
బును సుహృజ్జనంబులతోడం జెప్పుచున్నభరతుం గాంచి మ్రొక్కి తమ తెచ్చిన
యుపాయనంబు లిచ్చి దేవా వసిష్ఠుండు మహాకార్యంబు గలిగి మమ్ముం బుత్తెంచె
నీ వయోధ్యకు విచ్చేయవలయు నని విన్నవించుటయు నాదూతలచేష్టలకు భీతి
ల్లుచుఁ గేకయనాథుకడకుం జని యత్తెఱం గెఱింగించి యన్నరేంద్రు వీడ్కొని
శత్రుఘ్నసహితుం డయి కదలి సప్తరాత్రంబులకుఁ బురంబున కేతెంచి యంతి
పురంబు సొత్తేరం దల్లి యెదురుగాఁ బఱతెంచి యాలింగనంబు సేయుటయు
నద్దేవికి నమస్కరించి కేకయపతి పుత్తెంచినయాభరణంబు లిచ్చి వారిసేమం
బెఱింగించి పదంపడి యిది యేమి రాజమార్గంబు లమంగళావృతంబు లై యు
న్నయవి నగ రేల శూన్యం బై యున్నది సంతోషనాదంబు లేల వీతేవు నామ
నంబు గలంగెడు నెల్లవిధంబుల భద్రంబులు కదా యి ట్లునికికిం గారణం బేమి
యనుటయు నక్కైక యి ట్లనియె.

227

భరతశత్రుఘ్నులు రామునివనగమనాదులు విని యడలుట

సీ.

వసుమతీపతి రెండువరములు మును నాకు, నిచ్చినయవి గల వేను వాని
నొకట నీపట్టంబు నొక్కట రాముని, విపినవాసముఁ బోల వేఁడికొంటి
సంతసంబునఁ దండ్రి సత్యంబు పాలింప, జానకీలక్ష్మణసహితుఁ డగుచు
నారాఘవుం డేఁగె నడవికి మృతుఁ డయ్యెఁ, బుత్రశోకంబున భూవిభుండు
నిష్ఠురంబు లెల్ల నీ కొఱ కి ట్లేను, గట్టికొంటి నింక గారవమునఁ
బట్టి పూను రాజ్యంపట్టంబు నా మూర్ఛ, వచ్చి వ్రాలి కొంతవడికిఁ దెలిసి.

228


క.

కనుఁగవ నిప్పులు రాలఁగఁ, గనలుచు భరతుండు గైకఁ గనుఁగొని యారా
మునిఁ గాంతారంబునకుం, జను మన నెట్లాడె నోరు చయ్యన నీకున్.

229


చ.

అడవుల రామచంద్రుఁడు జటాజినముల్ ధరియించి యుండ నేఁ
బుడమి భరించి భోగములు పొందఁ గలానటె యిట్టిచొప్పు లే
యెడఁ గల వింక నన్నమొగ మేమి తెఱంగునఁ జూతుఁ బాపపుం
గడుపునఁ బుట్టి యీభువనగర్హకుఁ బాత్రుఁడ నైతి రాక్షసీ.

230


క.

నాచిత్తవృత్తి యెఱిఁగియు, నాచరితము గనియు రామునకు ద్రోహింగా
నీచమతి యెగ్గు సేసితి, వోచెల్ల మనంబు నొచ్చెనో రఘుపతికిన్.

231


వ.

దీనికి సుమిత్రాపుత్రుండు నామీఁద నెంత కోపించెనో నీనిమిత్తంబున నిన్ని
చేటులు పుట్టె నీ వొక్కరక్కసునకుఁ బుట్టఁబోలుఁ గేకయరాజబీజం బింత కేల
తొడంగు నీవు పాపజాతివి పతిహంత్రివి నీతో సంభాషింపం దగ దని పలుక