పుట:భాస్కరరామాయణము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీకర హా జయవరల, క్ష్మీకర హా రామ యనుచు మేను దొఱంగెన్.

223


వ.

ఇత్తెఱంగునం బ్రాణంబులు విడుచుటయు నతం డలసి నిద్రించుటగాఁ దలంచి
కౌసల్యాదేవియుం గను మొగిచి యుండెఁ బదంపడి సూతవందిమాగధస్తోత్రం
బులును మంగళతూర్యంబులునుం జెలంగ దాసదాసీపరిచారకులు తమతమప
నులు నిర్వర్తింపం బ్రభాతవేళకుం జేరి సూర్యోదయావసరం బతీతం బగుటయు
నిది యేల మేల్కొనరో యీరాచవా రనుచుఁ జింతించుచున్నంత నర్హకాంత
లంతఃపురంబునకుం జనుదెంచి యన్నరేంద్రుపడియున్నచందంబు గని భయా
తురతం గదిసి కరతలంబు లీక్షించి వక్షస్థలం బంటి యూర్పు లరసి విగతా
సుం డగుట నిశ్చయించి మొగంబు లడుచుకొనుచు మహారోదనంబు సేయన్
బెదరి నిద్ర దేఱి కౌసల్యాసుమిత్రలు పతి నేర్పడం జూచి హా రాజకుంజర హా
నాథ హా భర్త యనుచు నార్తరవంబు లొలయ నాక్రందనంబు సేయుచున్న
నావిధంబు విని శోకసంభ్రమంబులతోడం గైకేయియు రా నక్కడ నున్న
యువిదలుం దారు నయ్యింతిమీఁదం బడి మోఁదికొనుచుఁ గైకా నీకోర్కి
సఫలం బయ్యె రామచంద్రు నడవికిం బో నడిచి మగనిం జంపి తింక నీవలసి
నట్లు భోగింపు మనుచుం బలుక నప్పరుషభాషణంబులకుఁ దల వాంచికొను
చు వచ్చి యచ్చెలువయుం బ్రియునిపయిం బడి విలపింపం దొడంగె నాసమ
యంబున.

224


సీ.

పతిఁ జూచి కౌసల్య పనవుచు దశరథ, క్షోణీశ నీయట్టిసుకృతి కిట్టి
మరణంబు సిద్ధించె మది దీని కేమందు, నకట నాసుతుఁ బాసి యైన నీకుఁ
బరిచర్య సేయుచుఁ బదునాలుగేఁడులు, జీవంబు నొకభంగిఁ జిక్కఁబట్టి
యొకనాఁడు కడగాంతు నొకొయంచు నుండితి, నది తప్పెఁ బుత్రమోహమునఁ గీడు
పలుకు లప్పు డన్ని పలికితి ని న్నెట్లు, వెడఁగ నయితిఁ గోలుపడితిఁ జుమ్ము
రాజమౌళి వీరరత్నంబు లోకాభి, రాము గుణసముద్రు రామభద్రు.

225


చ.

వనమున కేఁగి నీపలు కవంధ్యముగాఁ బితృభక్తుఁ డై చిరం
తన మగుకీర్తి గాంచె గుణధాముఁడు రాముఁడు సత్యసంధుఁ డీ
జనపతి నాఁగ నీవును బ్రశంసకు నెక్కితి నాథ నాకు ని
న్ననుచితభంగి నిష్ఠురము లాడినపాపము దక్కెఁ జూచితే.

226


వ.

అని యనేకప్రకారంబులం గౌసల్య శోకింప సుమిత్రలోనుగా నంతఃపురకాంత
లెల్ల నడలుచుండి రంత నుదయసమయంబున వసిష్ఠవామదేవాదిపురోహితు
లును సుమంత్రపురోగము లయినమంత్రులును నధికసంభ్రమంబుతోఁ జను
దెంచి నానాప్రకారంబుల దుఃఖించిరి పదంపడి రఘువంశగురుం డైనవసి
ష్ఠుండు సర్వజనసమ్మతిం గాలోచితంబు నిశ్చయించి దశరథేశ్వరుదేహంబు
తైలపక్వంబు సేయించి సింహాసనంబునం గూర్చుండఁ బెట్టి జయంతుండు మొద