పుట:భాస్కరరామాయణము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తగునయ్య వనమునఁ దపసులమై యుండ, దయమాలి యాతెంపు దలఁతురయ్య
చీకులు వట్టిన చేకోల యది పోయెఁ, జీకుల మెచ్చోటఁ జేరువార
మప్పుణ్యు నేసినయమ్మున మమ్మును, బడనేసి దీవన బడయవయ్య
నీదునిష్ఠురబాణంబు నెఱఁకు దూఱఁ, గాఁడి పరవశుఁడై వ్రాలు కడఁక నపుడు
తండ్రి నేమని యెలుఁగిచ్చెఁ దల్లడంబుఁ, జెంది తల్లి నేమని పిల్చెఁ జెప్పుమయ్య.

205


ఉ.

ఆగురుభక్తితత్పరత నాపరమవ్రతనిష్ఠ నాతపో
యోగవిభూతి నొప్పెడుగుకణోన్నతుఁ డుత్తమచర్యుఁ డమ్మహా
భాగుఁడు పుణ్యగర్హితవిపద్దడశ కర్హుఁడె యట్టివాని కి
ట్టీగతి సంభవించె నఁట యేమని పొక్కుదు మింక నక్కటా.

206


క.

మతిఁ దలఁప నొడ లనిత్యము, మృతుఁ డవుఁ గా కేమి మఱి నిమిత్తము లేదే
యతిసుతుఁ డఁట నిర్ఘాతా, యతభీకరబాణపాత మఁట బాపు విధీ.

207


వ.

అనుచుం బెక్కుదెఱంగుల శోకించుచు నప్పు డత్తపోధనుండు నన్ను నుద్దేశించి.

208


శా.

వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్ణాథుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుం డన నెంతవాఁ డట విచారింపంగ నీ కెంత నే
ర్పేనిం బోవు శిరంబు వ్రక్క లయి తప్పెన్ దప్పె నీకృత్య మ
జ్ఞానంబుం గడు నోడి చెప్పితివి పశ్చాత్తాపతప్తుండ వై.

209


క.

కావున ని న్నే మన నిది, దైవాధీనంబ యింక ధరణీశ మమున్
వేవేగ యచటికిం గొని, పోవుట పురుషార్థ మనుడుఁ బొగులుచు వారిన్.

210


వ.

ఏ నక్కుమారుం డున్నయెడకుం గొనిపోయి వీఁడె మీతనూజుం డనుటయుం
దడఁబాటుచేతులతోడ ధరఁ దడవి కొడుకుమీఁదం బడి మూర్ఛిల్లి కొంతదడ
వునకుం దెలిసి విలపింపం దొడంగి రంత నత్తల్లి యుల్లం బెఱియ నెలుంగెత్తి
హా యజ్ఞదత్తా యనుచుం దనుజుం బేర్కొని.

211


సీ.

అక్కట నాతోడ నలిగినట్లున్నాఁడ, వెన్నిచీరినఁ బల్క వేల పుత్ర
ప్రాణ మై యుండియుఁ బాసిపోయితి వీవు, ప్రాణంబు న న్నేల పాయ దనఘ
యంధుల మగుమాకు నాధార మగుచున్న, ని న్నేల నేసె నీనృపుడు వత్స
కడలేనిదైవంబు కన్నుల కిదియును, ఘన మయ్యె నే మనం గలదు తండ్రి
కూన యెట్లు నీదుగుణములు మఱతు నిం, కేమి సేయుదాన నెందుఁ జొత్తు
నిషువు నాటునప్పు డెంతభీతాత్ముండ, వైతొ పాపజాతి నయితిఁ దనయ.

212


చ.

కొడుక శిలీముఖం బెచటఁ గూర్కొనె నిన్ను నటంచు నెత్తుటం
దడసినయక్కు చేఁ దడవి తత్ప్రదరక్షత మంటి కాలితిం
బొడవఱి పొక్కితిం బొలిసి పోయితిఁ బొ మ్మని కూర్మిపుత్రుపైఁ
బడి కనుమూసి కొంతవడి పల్కులుఁ జేష్టయుఁ దక్కి వెండియున్.

213


వ.

విధివశంబునం దెలిసి పెక్కువిధంబుల విలపించుచుండె నంత నత్తపోధనుండు.

214