పుట:భాస్కరరామాయణము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీగతోదకబంధ మేటికిఁ బో నిమ్ము, కడచన్నదానికి నడల వలవ
దనుమాటలకు నేను నాఘోరసాయక, మతిభీతిఁ బెఱుక నయ్యతిసుతుండు
మేను దొఱఁగె నతనిమృతి కేను శోకించి, కుండతోడ నీరు గొనుచుఁ దపసు
లున్నవనము చేర నొగిఁ బోయి సుతురాక, గోరుచున్నయట్టివారిఁ గంటి.

192


క.

అక్షివిహీనుల వృద్ధుల, నక్షములఁ దృషాతురుల వనన్యగతికులం
బక్షములు విఱిగి యొరగిన, పక్షులగతి నున్నవారిఁ బరమవ్రతులన్.

193


క.

కని యల్లన కదియఁగ న, య్యనఘులు నాకాలిచప్పు డాలించుచు నో
తనయుఁడ నీ విటు తడయం, జనునే యీయున్నయేటిసలిలంబులకున్.

194


ఆ.

ఏల రాఁడొ యనుచు నేను మీతల్లియుఁ, గలఁగఁబడితి మెచట నిలిచి తకట
మధ్యరాత్ర మిట్లు మసలుదురే మాకుఁ, గన్ను లన్న నీవ గతియు నీవ.

195


క.

జలతృష్ణ నీదురాకయ, తలపోయుచు నుండె నింకఁ దల్లికి నుదకం
బులు వోయు బుద్ధి చెప్పిన, నలిగినయ ట్లేల పలుక వని పల్కుటయున్.

196


ఉ.

దేహము దాహముం బొరయఁ దెంపునఁ జెప్పఁ దలంచి పుత్రుపై
స్నేహముఁ జూచి చెప్ప నని చెప్పకపో దని నిశ్చయంబుతో
సాహసబుద్ధిఁ జేసి మునిసత్తమ మీతనయుండఁ గా మహా
ద్రోహగరిష్ఠుఁడన్ దశరథుం డను పేరిటిపాపకర్ముఁడన్.

197


ఉ.

ఎక్కడఁ జూడఁ జెప్ప నిటు లెవ్వరుఁ జేయనియట్టిపాప మే
నొక్కడఁ జేసి మీకడకు నోడక వచ్చితి నేమి సెప్ప నీ
యెక్కుడుచీఁకటిం జలము లిమ్ముగఁ ద్రావురవంబునిక్కకుం
దెక్కలితూపు లేయుచు మదించుమృగంబులఁ జంపు చున్నెడన్.

198


వ.

మీతనయుండును సరయువునం గుండ ముంప నాచప్పు డాలించి విధివశంబున.

199


క.

అంజక తత్తటమున నొక, కుంజంబునఁ బొంచి యుండి కుంభద్వనికిం
గుంజర మని యేసితి ముని, కుంజర నీకొడుకు నేలఁ గూలం గోలన్.

200


వ.

అప్పు డక్కుమారుండు.

201


క.

బాణహతి నెలుఁగు సేసినఁ, బ్రాణంబులు గలఁగఁబాఱి { బాణము పెఱుకం
బ్రాణములు విడిచె ననవుడుఁ, బ్రాణంబులు జ ల్లనంగఁ బడి మూర్ఛిల్లెన్.

202


క.

ఏమని చెప్పుదు ని ట్లను, నామాటయుఁ దెగకమున్న హా పుత్రా యం
చామునిపత్నియు నప్పుడు, భూమిం బడియుండె రిత్తబొందియపోలెన్.

203


వ.

ఇత్తెఱంగున మూర్ఛాపరవశు లయి యున్నయత్తపస్వులం జూచి చిత్తంబు
గలంగి యే నల్లన బోధింప నెట్టకేనియుం దెప్పిఱి వారు నాదెసకు దీనవదనంబు
లెత్తి నోళ్లు దెఱచుచుం బెదవులు దడుపుచు డగ్గుత్తికలు పెట్టుచు నెలుంగులు
రాల్పడ ని ట్లనిరి.

204


సీ.

ఏమయ్య మాపట్టి నింతపాపము సేసి, తేమి చేసినఁ జావ నేసి తయ్య