పుట:భాస్కరరామాయణము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అలయకుండఁ దోకొని నాఁడు మూఁడుయోజనంబులు సని సుదర్శనం బనుస
రోవరంబు గాంచి తత్తీరవటమూలంబున విడిసి మృణాళఖండంబు లాహారంబుగా
గొని యా రాత్రి యచ్చటనుండి మఱునాఁడు యోజనత్రయం బరిగి.

151


క.

అమితాఘభంగరంగ, త్క్రమచంగము మృదులతుంగతరతరళతరం
గము గంగాయమునాసం, గము చేరి ప్రయాగవటము గని దాశరథుల్.

152


ఆ.

అందు మునివరేణ్యుఁ డగు భరద్వాజుఁ ద్రి, కాలవేది శిష్యగణసమేతు
మహితమూర్తిఁ గని నమస్కరించుటయు దీ, వించి వారిఁ గాంచి వెఱఁగు నొంది.

153


క.

యోగసమాధి నతీతా, నాగతవృత్తాంత మరసి యాఘనులకు నా
నాగుణధనులకుఁ గరుణా, సాగరులకుఁ జేసె నతఁడు సత్కారంబుల్.

154


క.

ఇత్తెఱఁగున నాసంయమి, సత్తముచే నుచితకృతుల సత్కృతు లై భూ
పోత్తములు రాత్రి మహిమో, దాత్తస్థితి నచట నిలిచి రట దివసమునన్.

155


మ.

ఘనదుర్గం బగుచిత్రకూటనగమార్గం బాభరద్వాజుచే
విని తత్పాదసరోరుహంబులకు నావీరోత్తమున్ మ్రొక్కి వీ
డ్కొని వేడ్కం జని రఫ్డు రాముఁడు కనకత్కోదండశుంభద్గుణ
ధ్వని మోయించి మృగావళుల్ బెదర సీతం బ్రీతిఁ బొందించుచున్.

156


శా.

ఆలోలాక్షికిఁ దద్విలోకనవినోదాసక్తి రెట్టింప ను
త్తాలాభీలవిశాలసాలవిచలద్వాతూలదూరాగ్రశా
ఖాలీలాభ్రము లోలిఁ జూపుచు మహాకల్లోలినీరత్నముం
గాళిందీనది దాఁటి సిద్ధవటముం గన్గొంచు నమ్ముందటన్.

157


వ.

మఱియు నానావిధంబు లైనవినోదంబుల నమ్మేదినీసుతకు దుర్గగమనపరిశ్రాంతి
దోఁపకుండం జేయుచుండె నాసమయంబున.

158

శ్రీరామమూర్తి చిత్రకూటంబు చేరుట

చ.

అటఁ జని కాంచి రంత వసుధాధిపు లారతిలోలకిన్నరీ
ఘటితగుహాకుటీకనకకమ్రకవాటము సన్మణిప్రభా
హటదురుశృంగజూటము సమావృతమాల్యవతీతరంగిణీ
తటతరువాటమున్ బహుళతాపసకూటముఁ జిత్రకూటమున్.

159


సీ.

మహనీయతరహోమమంత్రస్వరంబులు, గంధర్వమంజులగానతతులు
విలసితకిన్నరీవీణారవంబులు, శారికోపన్యాసచతురతలును
రాజకీరాలాపరచనాకలాపముల్, కలహంసనిస్వనకలకలములు
కమనీయకోకిలకలనినాదములు రో, లంబఝంకారకోలాహలములు
గలుగుదాని వేదగంభీరఘోషముల్, గలయఁ జెలఁగుదాని గాలి నోలి
మొరయు వేణురంధ్రములదానిఁ జేరఁగ, నేఁగుదెంచి యన్నగేంద్ర మెక్కి.

160