పుట:భాస్కరరామాయణము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కౌసల్యాసుమిత్రలశోకంబుఁ జెప్పి రామధైర్యంబు గర్హించుచు నర్హం బగు
నెడ గుహుండును దానును గూర్చుండి వగలం బొగులుచుండె నంతఁ బ్రభాతం
బేఁగుదెంచిన.

140


ఆ.

సమయవిధులు దీర్చి సౌమిత్రిసహిత మీ, రేడువత్సరములు ధృతి గరిష్ఠ
నిష్ఠఁ దపము సేయ నేమంబు కైకొని, మనుజనాయకుఁడు సుమంత్రుఁ జూచి.

141


చ.

అనుచిత మింక మాకు రథరయానము గావునఁ దే రయోధ్యకుం
గొని చని మాతెఱంగునకు గుండెలు గ్రుళ్లుచు నున్నయన్నరేం
ద్రునకును మువ్వురమ్మలకు మ్రొక్కితి మే మని విన్నవింపు నీ
వనునయభంగి వారిహృదయంబులశోకము లార్పు నేర్పునన్.

142


ఉ.

నావుడు గద్గదస్వరమునం బతితో నను రామచంద్ర ని
న్నీవనభూమి డించి చని యే మని పౌరుల కింకఁ జెప్పుదున్
భూవిభునొద్ద కెట్లు గొనిపోవుదు శూన్యరథం బవశ్యముం
దావకసేవకుండ భవుదంఘ్రుల నే నిటఁ గొల్చి వచ్చెదన్.

143


ఉ.

ఆనతి యిమ్ము నావుడు రయంబున నీ వటు వోయి వారు గం
గానది దాఁటిపోయి రని కైకకు నమ్మిక పుట్టఁ జెప్పినం
గాని నిజంబు సేయ దటు గాన యయోధ్యకు నేగు మన్న దీ
నాననుఁ డై యతం డరిగె నారథ మెక్కి విషాద మందుచున్.

144


వ.

తదనంతరంబ గుహుడు కర్ణధారుండుగా నావ యెక్కి సీతాసమేతంబుగా నక్కు
మారనిధానంబులు.

145


మ.

ఘనబాహాపరిఘాభిరాములు కనకత్కాండప్రచండాశుగా
సను లుత్తుంగవిశాలవక్షులు విరాజత్పంకజాక్షున్ సుధాం
శునిభాస్యున్ గమనీయమూర్తులు రఘుక్తక్షోణీశు లప్పుణ్యభా
గిని భాగీరథ నుత్తరించి రకలంకీభూతచేతస్కు లై.

146


తే.

ఇత్తెఱంగున నాగంగను తరించి, గుహునిచేఁ ద్రోవఁ జూపించుకొని ప్రియమ్ము
తోడ నక్కిరాతాగ్రణి వీడుకొలిపి, యమ్మహారణ్యపథమున నరుగునపుడు.

147


క.

హతవిధి కృతి ని ట్లతికఠి, నతరస్థలి నడుగు లిడుచు నడు మసియాడం
గతిపయమృదుపదగతి నా, క్షితిసుత డయ్యుటయుఁ జూచి చిత్తం బవియన్.

148


చ.

నడు మిసుమంత మీఁదఁ గఠినస్తనభారము తోర మంతకుం
దడఁబడు లేఁతనెన్నడపదమ్ములు నూతనపల్లవంబులం
గడచినకోమలంబు లని కాదె తనున్ నిలు మంటి నింట నేఁ
బడియెడు నెన్నిపాటులనొ పక్ష్మలలోచన చూడు లక్ష్మణా.

149


క.

నడవం జాలక యడుగులు, తడఁబడఁ బొగులుచును నోరు దడుపుచు నకటా
కడుఁ దూలె ననుచు విభుఁ డెడ, నెడ నీడల నిలిచి నిలిచి యిభనిభగమనన్.

150