పుట:భాస్కరరామాయణము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పౌరసమేతుఁ డై రఘునృపాలకుఁడుం దమసాతరంగిణీ
తీరము సేరఁగా నరిగి తే రట డిగ్గి పితృప్రసూచితా
చారవిధంబు లత్తటినిఁ జల్పి జలంబులు ద్రావి ధైర్యవి
స్తారత విశ్రమించె మృదుతల్పసమస్థితిఁ బర్ణశయ్యపై.

130


క.

పురజనులు దిరిగి వచ్చియుఁ, దరతరములు రాముఁ గొల్చి తద్గుణగణనా
పరవశతం దమతమమం, దిరములదెసఁ దలఁపు మఱచి నిద్రించుటయున్.

131


క.

ఎప్పుడు విడువక తిరిగెద, రిప్పౌరుల డించి చనఁగ నిది తఱి నా కం
చప్పుడు విభుఁడు సుమంత్రుం, జప్పుడు గాకుండ గూఢసంజ్ఞం దెలిపెన్.

132


ఆ.

తెలిపి రథ మయోధ్యదెసకుఁ బోవఁగ నిచ్చి, తప్పు తెరువునందుఁ ద్రిప్పి తెచ్చి
తమసనదియు వేగ దాఁటింపు మనవుడు, నర్ధరాత్ర మతఁడు నట్లు చేసె.

133


వ.

రామచంద్రుండును నన్నది నుత్తరించి తత్తీరవనభూములు భూమిజకుం జూపుచు
నయ్యయిజనపదంబులవిలాసంబులను వినుచు వేగవతియు సరయువునుం దాఁటి
దివసావసానసమయంబునకు గంగాతీరంబుఁ జేరి యొక్కయింగుదీతరుప్రాంతం
బున విడిసె నిక్కడఁ దమసానదీతీరంబున.

134


ఉ.

పౌరులు మేలు కాంచి నరుపాలకుఁ గానక విన్నఁబాటుతో
నారథమార్గ మారసి నృపాగ్రణి క్రమ్మఱఁ బోవఁబోలు నిం
పార నయోధ్య కంచుఁ జని యప్పురలక్ష్మి యమంగళంబులం
గోరుట చూచి గేహములఁ గొందల మందుచు నుండి రిక్కడన్.

135

గుహుండు సీతారామలక్ష్మణులను గంగ దాఁటించుట

క.

గుహుఁ డనునిషాదనాథుఁడు, మహితాంబరరత్నఖచితమండనసుమన
స్సహితోపాయనములతో, విహితంబుగ రామవిభుని వేడుకఁ గనియెన్.

136


సీ.

కని మ్రొక్కి య ట్లున్నికి గనుఁగొని వెఱఁగంది, యేమి యోదేవ నీ వీతపస్వి
వేషంబు ధరియించి విగతసైన్యుండ వై, కానకు విచ్చేయుకారణంబు
మీబంట నే నుండ మి మ్మింత సేసిన, ద్రోహి వాఁ డెవ్వఁడు తులువ నాదు
బాణాసనార్చులపాలు కావించెద, ననిన నవ్వుచు రాముఁ డంతతెఱఁగు
నోలిఁ దెలియంగఁ జెప్పి వీరోక్తు లుడుప, శబరపతి యఫ్టు గైకదోషంబునకును
రాజునవివేకమునకు నారాఘవులకు, నయినదురవస్థకును దుఃఖితాత్ముఁ డయ్యె.

137


వ.

అంత నమ్మహీపతియుం గిరాతపతిని బోధించి సంధ్యానియమంబులు దీర్చి నిద్రించె
నాసమయంబున.

138


ఉ.

ఆపదునాలుగేఁడులు నరహర్నిశముం దననిద్ర దప్పి యా
రోపితచాపుఁ డై రఘువరుం గొలువం బరమాద్భుతప్రతి
జ్ఞాపరుఁ డైన లక్ష్మణుఁడు జానకివిన్నఁదనంబు చిత్తసం
తాపము సేయ నాశబరనాథుని కద్దెసఁ జూపి వెండియున్.

139