పుట:భాస్కరరామాయణము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గూడం దోడనె తెంపు గూడుటయు నక్కుంభిన్యధీశాగ్రణీ
చూడారత్నము తేరు వే నడపు మంచుం జెప్పె నయ్యాజ్ఞకున్.

119


క.

హరుల సుమంత్రుఁడు వోని, చ్చె రయంబున నప్పు డావసిష్ఠుఁడు నిలు మో
నరనాథ వెనుక నడలుచు, నరుగం జన దనఁగ నిలిచి యధికాతురతన్.

120


ఉ.

పంబినపుత్రమోహమునఁ బార్థివుఁ డారథ మేఁగఁగా విషా
దంబునఁ జూచి చూచి యరదం బటఁ గనక తద్ధరాపరా
గం బటు సూచి చూచి యది గానక కొండొకసేపు దా నిరా
లంబనదృష్టి యై కడుఁ గలంగి మనోభ్రమ నిండ వెండియున్.

121


వ.

నిజనందనస్యందనంబు ముందటం దోఁచిన ట్లయిన.

122


చ.

అదె రఘువీరుఁ జన్నరథ మల్లదె పోయెడి రాముతేరు పొ
మ్మదె యన పోయె నయ్యరద మక్కడఁ దోఁచెఁ దదీయభూరజం
బదియు నడంగెఁ బొ మ్మకట హా గుణరత్నమ హా కుమార హా
సదమలకీర్తిహార నృపసత్తమ హా ననుఁ గూడ నీఁ గదే.

123


శా.

ఓపట్టీ నను డించి నీ వరిగెదే యుగ్రాటవీవాటికిన్
నాపుణ్యం బిటు లయ్యెనే వినఁ గదే నా కేది దిక్కుంచు నా
భూపాలుం డతిదుస్తరవ్యధఁ బడుం బొక్కున్ గళద్బాష్పుఁ డై
చూ పాదిక్కున దవ్వు గాఁగ నిగిడించుం దూలు దైన్యంబునన్.

124


వ.

ఇ ట్లంతకంతకు మోహావేశం బడరి మూర్ఛాపరవశుం డగుచు నేలంబడి పొరలి
ధూసరితాంగుం డై కొండొకసేపునకుం దెలిసి కైకేయిం గనుంగొని.

125


ఉ.

పాతకవర్తి వైననినుఁ బత్నిఁగఁ గైకొని యున్న నేనునుం
బాతకవర్తి నింక నతిపాతకవర్తిని ముట్టఁ గాదు వి
ఖ్యాతిగ నిట్లు నింద కొడిగట్టితి సంతస మందు దీన దు
ర్నీతి దురాత్మురాల వగు నీక చనుం గులనాశకారిణీ.

126


క.

అని పతి పలుకఁగఁ గనుఁగొని, వనితలు నిందింపఁగా నవనతానన యై
వినుచుండెం గైకేయియుఁ, దనయంతనె మగిడెఁ బురికి ధరణివిభుండున్.

127


తే.

అరుగుదెంచియు నిర్జనం బయినపురము, విన్నఁబోవుటఁ జూచి నిర్విణ్ణుఁ డగుచు
నగరు సొత్తెంచి చిత్తంబు వగలఁ బొగుల, శయ్యపై మేను వైచి కౌసల్యఁ జూచి.

128


సీ.

ఇంతకు రఘురత్న మెంతద వ్వరుగునో, యకట యప్పుణ్యుఁ డేయంఘ్రిపముల
నీడల నుండునో నేఁ డెట్లు కందమూ, లము లారగించునో లలితచరిత
భూపుత్రి యేగతిఁ బొందునో రాముఁ డ, మ్ముద్దియవాడినమోముఁ జూచి
హృదయంబు గందంగ నే మని వగచునో, సౌమిత్రి నాదుష్టచరితములకు
నొచ్చి యెన్ని పల్కునో యంచు వగవఁ గౌ, సల్యలోనుగాఁగ సతులు గూడి
పాపజాతిఁ గైకఁ బలుమాఱు దూఱు చం, దంద నడలుచుండి రచట నంత.

129