పుట:భాస్కరరామాయణము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

దళదంభోజపరాగరాగవిలసకత్కల్లోలకేళీనట
త్కలహంసవ్రజచక్రసారసబకక్రౌంచభ్రమద్భృంగసం
కులనానారవశిక్షణద్భహుసరఃకూలానుకూలక్రియా
లలితాలోలసమీరకంపితలతాలాస్యంబు లీక్షించుచున్.

161


తే.

వచ్చి సంయమీంద్రుల కభివందనంబు, చేసి సత్కారములు వారిచేతఁ గాంచి
యమ్మహాత్ములయనుమతి నచటఁ బర్ణ, శాలఁ గట్టించుకొని తపశ్చరణనియతి.

162


క.

నెఱసిన రాజ్యసుఖంబులు, మఱచి మహామునులగోష్ఠి మచ్చిక లలరం
గిఱికొనుచిత్తంబులతో, నుఱుతెఱఁగుల నుండి రంత నొకనాఁ డెలమిన్.

163


సీ.

అవనిజ దేవోపహారఫలంబులు, చెలువార వలవాటు సేయుచోట
నుపహతి గావింప నొకకాక మేతెంచి, సుడియంగఁ బలుమాఱుఁ జోఁపి చోఁపి
కడు డయ్యుటయు దానిఁ గని నృపాలుం డిషి, కాస్త్రంబు మంత్రించి యలుక వైవ
నదియు వెన్నడి నస్త్రమై తోల నక్కాకి, త్రిజగంబు గ్రుమ్మఱి దిక్కు లేక
మగుడ నేఁగుదెంచి మనుజేంద్ర యపరాధిఁ, గావుమనుడు విభుడు గరుణచూడ్కి
నొలయ నల్ల నగుచు నోపక్షి నావిశి, ఖంబు రిత్తపోదు గాన వినుము.

164


క.

నీయం దొకనయనము నా, సాయకమున కిచ్చి బ్రతికి చను మనవుడు నా
వాయసమును నొకయంబక, మాయంబకమునకు నిచ్చి యరిగెం బెలుచన్.

165


ఆ.

అంత వారు నపహృతావశిష్టము లగు, నాఫలంబు లెలమి నారగించి
మునులఁగొలిచి మిగులముదముతోఁ జిత్రకూ, టాచలమున నుండి రతులగతుల.

166


వ.

అంత నిక్కడ సుమంత్రుం డయోధ్యానగరంబు సొచ్చి దీనాననుం డయి రాజ
మార్గంబునం జనుదేరఁ దేరిచప్పు డాలించి రామచంద్రుండు రాఁబోలు ననుచుఁ
బురజనంబులు సంభ్రమంబునం బఱతెంచి రామలక్ష్మణవిరహితస్యందనుం డగు
నాసుమంత్రునిం బెక్కుదెఱుంగులం దిట్టుచు నధికశోకంబునం బొగులుచుండి
రంత నప్పలుకు లాలించుచు నతండు నగరివాకిట రథావతరణంబు సేసి యంతః
పురంబులోనికిం బోయి దశరథేశ్వరునడుగులం బడి గద్గదికతోడం దొడరు
నెలుంగున.

167


తే.

దేవ రాముఁడు గంగానదీతటమున, జడలు గైకొని నీకును జననులకును
నలఘుమతి మ్రొక్కి నన్ను వీడ్కొలిపి చనియె, నత్తటిని దాఁటి చిత్రకూటాద్రి కనిన.

168


ఉ.

రామయుఁ దమ్ముడుం గొలువ రాజశిఖామణి చిత్రకూటచూ
డామణి యైనవార్త చెవి డాసిన నొచ్చితి నింక నారఘు
గ్రామణి యున్నచోటి కనుఘా ననుఁ దోకొని వేగ పోఁ గదే
రామవియోగవేదనను బ్రాణము లుండక తల్లడిల్లెడిన్.

169


క.

అనిన సుమంత్రుం డి ట్లను, జనవర వనమునకు నీవు చనఁగాఁ బౌరుల్
వెనుకనె వత్తురు వచ్చినఁ, గనుఁగొని యది కైక యొండుగా భావించున్.

170