పుట:భాస్కరరామాయణము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేజ మెసఁగు మంచు సమ్మతించి యున్నచోట నొం
డోజ నిచట దైవఘటన మున్న నేమి సేయుదున్.

92


క.

అతివలు ధనవిరహతు లగు, పతులను దిగవిడుతు రెన్నిభంగుల ధర్మ
స్థితిఁ దలఁపరు తాదృగ్విధ, సతులను నినుఁ జెప్పి చెప్పఁ జనునే సాధ్వీ.

93


క.

నిర్ధనుఁడు గాఁడు రాముఁడు, వర్ధిష్ణుఁడు పడయఁ జాలు వాసవభోగ
స్పర్ధి యగువిభవ మితఁడు ధ, నుర్ధరుఁ డై యమ్ముదెసఁ గనుంగొనుమాత్రన్.

94


వ.

అని వెండియు.

95


చ.

దశరథువాక్యశాసనము తప్పుట త ప్పని నిశ్చయించి యీ
దశను ధరించి లోకవిదితంబుగఁ గానలలో శరచ్చతు
ర్దశకముఁ బుచ్చి వచ్చి రఘురాముఁడు నిర్మలకీర్తిచంద్రికల్
దశదిశలన్ వెలుంగు వసుధాపరిపాలనకేళి సల్పెడిన్.

96


వ.

అని పలికి నందనువదనారవిందం బవలోకించి ఱెప్పలు వ్రాలవైచి మనంబునం
బొగులుచుండె నప్పు డారాఘవేశ్వరుండు తల్లి నామంత్రణంబు చేసి సీతాలక్ష్మణ
సమేతుం డయి సుమిత్రాదేవిపాలి కేతెంచి యంతవృత్తాంతంబు నెఱింగించి
నమస్కరించి వీడ్కొనుసమయంబున నజ్జననియు శోకదందహ్యమానమానస
యగుచు ని ట్లనియె.

97


క.

అక్కట కైకకుఁ దగునే, యిక్కొడుకున కెగ్గు సేయ నిటు గలదే రా
జిక్కీడున కోర్చెఁ గదే, నిక్కము కృప గలదె కామినీమగ్నులకున్.

98


వ.

అని పలికె నంత లక్ష్మణుండు సమస్కరించుటయు దీవించి యక్కుమారువదనం
బాలోకించి.

99


క.

మనమున రాముని దశరథ, జననాయకుఁగాఁ దలంపు జనకతనూజన్
ననుఁగాఁ దలఁపుము కానన, ము నయోధ్యగఁ దలఁపు మేఁగు ముదమునఁ దండ్రీ.

100


ఉ.

భూమితనూజ ముగ్ధ వనభూములఁ బెక్కులు దైత్యమాయ లు
ద్దామబలాఢ్యుఁ డై సుగుణధాముఁడు రాముఁడు నిద్రవోవుచో
నేమఱ కెప్డు నీవు శర మేర్చి యధిజ్యశరాసనుండ వై
సేమ మెఱింగి యుండు మని చెప్పెఁ బదంపడి సీత మ్రొక్కినన్.

101


ఉ.

అక్కున నక్కు సేర్చి ముద మారఁగ దీవన లిచ్చి తల్లి నీ
వెక్కుడుపుణ్యశీలమున నిష్టమతిం బతి కానుకూల్యమున్
దక్క కొనర్చుచుండు మని తత్పరతం దగబుద్దు లిమ్ములం
బెక్కులు చెప్పి వీడ్కొలిపెఁ బేర్చినశోకముఁ దాల్మి నాఁగుచున్.

102


వ.

అంత రామచంద్రుండును సౌమిత్రియు ధరిత్రీపుత్రియుం దోడరా నాతపత్ర
ధ్వజచామరశూన్యుండును బాదచారియు నై రాజమార్గంబునం గ్రందుకొని
తమవేషంబులకుం బొగులుచున్న పురజనంబులం జూచి నవ్వుచు నిజమందిరంబు