పుట:భాస్కరరామాయణము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దగ నలంకరించి జగదమందానంద, కారు లగుచు సహజగౌరవమున
సరసభంగు లమర నిరువురు శచియు నిం, ద్రుండుఁబోలె నలరుచుండి రెలమి.

26


వ.

అపుడు వసిష్ఠుండు సకలమునిజనంబులతో నభిషేకమండపంబున కేతెంచి నానా
దేశంబులరాజులను సమస్తమంత్రివరులను నరుంధతి మొదలయిన పురంధ్రీజ
నంబులను రావించి సర్వధాన్యంబులు వివిధరత్నంబులు ననేకదివ్యాంబరంబులు
నశేషభూషణంబులుం గల్యాణపల్లవంబులుం గల్హారాదిమంగళకుసుమంబులుం
జందనకర్పూరకస్తూరీగోరోచనాదిసుగంధద్రవ్యంబులును గంగాయమునాదిమ
హానదీసముద్రోదకపూర్ణంబు లగుసువర్ణకుంభంబులును రాజయోగ్యంబు లగు
కరితురగస్యందనంబులును ధవళచ్ఛత్రచామరంబులును దానార్థంబుగాఁ గన్య
కాధేనువృషభంబు లొక్కొక్కలక్షయుం దెప్పించి మాణిక్యఖచితంబు లగునౌ
దుంబరభద్రపీఠంబులు మణిమండపమధ్యంబునఁ బెట్టించి సింహచర్మంబు పయి
నమర్చి బహుగీతనృత్తవాద్యంబులుం బ్రశస్తహోమంబులుం బుణ్యశాంతులుం
జీయం బంచి శుభలగ్నంబు సాధించి సుమంత్రునిం బిలిచి నీవు దశరథుం
దోడ్కొని ర మ్మని నియోగించిన నతం డంతఃపురంబునకుం బోయి కైకేయీ
గృహద్వారంబున నిలిచి యి ట్లనియె.

27


తే.

దేవ యుదయాద్రి కినుఁ డేఁగుదెంచుచున్న
సమయ మభిషేకలగ్న మాసన్న మయ్య
నర్హ మగుభంగి రాము రాజ్యాభిషిక్తుఁ
జేయవలయును నటకు వేంచేయవలయు.

28


క.

అని విన్నపంబు సేయుట, యును నిద్దురపోయినట్టు లూరక యుండెన్
మనుజపతి కైక యప్పుడు, జననాయకుపలుకు గాఁగ సాహసబుద్ధిన్.

29


క.

అభిషేకోత్సవలీలా, విభవం బలరారఁ గొడుకు వేడుకతోడన్
విభుఁడు గయిసేయఁ గోరెడు, రభసంబున నీవు పోయి రఘురత్నంబున్.

30


మ.

ఇటకుం దోకొని రమ్ము నావుడు నతం డేతెంచి విచ్చేయు మ
చ్చొటికి నిన్ను విభుండు రమ్మనియె నంచుం జెప్ప నాశీర్వచ
స్ఫుటనాదంబులతో సుమిత్రకొడుకున్ భూపుత్రియుం దాను నొ
క్కొటఁ దే రెక్కి నృపాలఫాలముల మ్రొక్కుం గేలుదో యొప్పఁగన్.

31


క.

పంచమహాశబ్దంబు లు, దంచితగతి మొరయ జయజయధ్వను లులియం
జంచన్నానాసేనా, సంచయములు బలిసి కొలువ సమ్మదలీలన్.

32


ఉ.

మంగళపుష్పసంఘములు మౌక్తపుసేసలు నింతనంతఁ బు
ణ్యాంగన లోలిఁ జల్ల నగ రల్లన డాయఁగ నేఁగుదేరఁ ద
న్వంగులు రత్నదీపకళికాళినివాళు లొనర్పఁ జేసె ను
త్తుంగరథావరోహణము తోరణపంక్తుల నొప్పుమోసలన్.

33