పుట:భాస్కరరామాయణము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కైక రాముని వనంబునకుం బంప దశరథు నడుగుట

క.

పలికిన భరతునిఁ బట్టము, నిలకుం గట్టుటయు రాము నీరేడబ్దం
బులు కానకుఁ బొ మ్మనుటయు, నిలువేల్పులు సాక్షి గాఁగ ని ట్లీ రెండున్.

18


ఉ.

వేఁడిన వేఁడిమాట నృపవీరుఁడు సైఁపక కర్ణరంధ్రముల్
సూఁడినభంగిఁ దాఁకుటయు స్రుక్కి మనంబున నొచ్చి నిన్ను నే
నాఁడు నృపాలపుత్రి వని నమ్మి వరించితిఁ గాక యిమ్మెయిన్
నేఁ డొకకాలసర్ప మయి నీ విటు సేయుట నాకుఁ దోఁచెనే.

19


ఉ.

కీడున కోడ కించుకయుఁ గేకయభూపతియింటఁ బుట్టి చొ
ప్పాడక పాపజాతి వయి తక్కట యి ట్లని వేఁడ నెట్లు నో
రాడెఁ ద్రిలోకపూజ్యుఁ డగునాకొడు కేమిట నీకు నొప్పఁడే
పాడి దలంప కీపలుకు పల్కితి దోసము నాక నాకడన్.

20


ఆ.

భరతుకంటె నీకు భక్తుండు తమ్ముల, ముగురు నొక్కభంగి ముద్దు సేయుఁ
దల్లు లెల్ల సరియ తగునే యాపుత్రని, ధానమునకుఁ గీడు దలఁప నకట.

21


క.

విడుతుం బ్రాణము లయినను, విడుతున్ మహిరాజ్య మెల్ల వేఁడిన రామున్
విడుతునె యాగుణరత్నము, విడువను దత్పాపచింత విడువుము తన్వీ.

22


సీ.

అనవుడు నక్కైక జననాథుతో నను, నిక్ష్వాకువంశమహీశు లెల్లఁ
బలికి తప్పరు నీవు కులధర్మ మొల్లక, కౌసల్యదిక్కునఁ గరము వెఱచి
సడి కోర్చి సత్యంబు విడువఁగఁ దలఁచెదు, భూపాల యిది యొక్కపురుషగుణమె
బొంకుదురే రాజు లింక నీముందర, విష మాని ప్రాణముల్ విడుచుదాన


తే.

నంత భరతుని సమయించి యనుఁగుఁదనయు, రాము నిష్కంటకంబుగా రాజ్యమునకు
నధిపుఁ గావించి నీవు నీయగ్రసతియు, విభవమున నుండుదురుగాక వేయు నేల.

23


చ.

తలఁ పొడఁగూడెఁ బొమ్ము వసుధావర నావుడు నొక్కమాటయుం
బలుకక మిన్ను వచ్చి పయిఁ బడ్డతెఱంగునఁ దూలి నెమ్మనం
బలఁగ మొగంబు వంచుకొని యశ్రులు రాలఁగ శోకవహ్నికిం
గొలువగుచుండె భూరమణకుంజరుఁ డంతఁ గ్రమక్రమంబునన్.

24


చ.

అళికుల మల్లనల్ల నవహల్లక మొల్లక కేసరోల్లస
ద్దళదరవిందమందిరవితానము చేర నగాధదీర్ఘికా
జలజనవీనగంధములు చల్లుచుఁ జల్లనిగాడ్పు లిమ్ములం
బొలయ గృహప్రదీపములపోఁడిమి దూలఁ బ్రభాత మొప్పినన్.

25


సీ.

వివిధమంగళతూర్యరవము లొప్పఁగ వంది, సూతమాగధజనస్తుతులు గలయఁ
జెలఁగఁ బుణ్యోదకంబుల రామచంద్రుండు, జనకపుత్రియుఁ దాను జలకమాడి
మహితాంబరంబుల బహురత్నరాజిత, మండనంబుల రమ్యమాల్యతతుల
సురభికస్తూరికాగురుచందనాదుల, లలితాంగరేఖావిలాసకళలఁ