పుట:భాస్కరరామాయణము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంథర కైకకు దుర్బోధనలు చేయుట

శా.

కైకా నీకు విభుండు గూర్చు ననుచున్ గర్వింతు ము న్నెప్పుడున్
లోకైకప్రకటంబుగా నిదిగో దా లోలాక్షి కౌసల్య క
స్తోకప్రేమభరంబు చూపుటకు రాజుం జేయుచున్నాఁడు నేఁ
డాకాంతాతిలకంబుపుత్రు భరతుం డ ట్లుండ ని ట్లిమ్ములన్.

11


తే.

సవతితల్లికొడుకు సకలభూభాగంబు, ననుభవించుచుండ నకట భరతుఁ
డధికదీనవృత్తి నాతనియడుగులు, కొలిచి యుండవలసెఁ బలుకు లేల.

12


శా.

పాటించుం బతి నిన్ను నీ వడిగినం బ్రాణంబు వంచింపఁ డి
వ్వీటం బట్టము గట్ట నీతనయునిన్ వే రాము నుగ్రాటవీ
వాటిం బోయి చతుర్దశాబ్దము లొగిన్ వర్తింప నీరెండు మో
మోటం గొంకక వేఁడు మన్న మదిలో నూహించి యక్కైకయున్.

13


ఉ.

బంధులు మంత్రులున్ భరతుఁ బట్టరు రాముఁడు పెద్దవాఁడు స
ద్బంధురదోర్బలుండు గుణభాసియు నౌసుతుఁ నుండ నాసుతున్
సింధుపరీతధాత్రి కభిషిక్తునిఁ జేయునె భూవిభుండు సం
బంధము గాదు చిక్కితి నుపాయ మెఱింగినఁ జెప్పు మంథరా.

14


వ.

అనిన నది యి ట్లనుం దొల్లి జయంతపురంబునం బురందరశంబరులకుం గయ్యం
బయిన నయ్యింద్రునకుం దో డరిగి దశరథుండు భండనంబు సేయునవసరంబున
నారాక్షసుం డనేకమాయలు గావింప నీవు ధవళాంగుం డనుమునివలనం బడ
సినమంత్రవిద్యచేత వానికిం బ్రతీకారంబు లొనర్చుటకు మెచ్చి నాఁడు నీకు
రెండువరంబు లిచ్చినవాఁడు నేఁ డవి దలంపించి నా చెప్పినయిరుదెఱంగులు
వేఁడికొను మవ్విభుండు నీయందు నెయ్యుండును సత్యసంధుండును నగుట నీయ
డిగినయట్ల యొసంగు ననుచుం బాపోపదేశంబు చేసినం గైకేయి సంతోషించి
దానికిం బసదనంబు లొసంగి యొక్కగొంది సొచ్చి ముసుంగు పెట్టుకొని నేలం
బరుండి యీలిగిన ట్లుండె నాసమయంబున.

15


సీ.

జననాథుఁ డచటికిఁ జనుదెంచి యట్లున్న, కైకేయిఁ బొడగని కడుఁ గలంగి
చిత్తంబు మదనార్తిఁ జిడిముడి పడియుండ, నేమి కారణమున నిట్టు లునికి
యెవ్వరు నీదెస నెగ్గు చేసిరి నీకు, నహితవాక్యము లెవ్వ రాడి రిచట
నడిగినఁ బ్రాణంబు లాదిగా నెవ్వియే, వంచింప కిత్తును వనజవదన
ముసుఁగు పుచ్చ వేల మొగ మేల యలరింప, వకట నెపము లేక యలుగ నేల
పలుక నేల మృదులపర్యంక మటులుండ, నొడలు నొవ్వ నేల నుండ నేల.

16


క.

నావుడుఁ బతిమదనాతుర, భావం బవ్వనిత చూచి పార్థివవర నాఁ
డీ విచ్చినవరములు నేఁ, డీవలయును రెండు ననుడు నిచ్చితి ననుచున్.

17