పుట:భాస్కరరామాయణము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానుగఁ జేసి జన్నములు మానక చేసి వివస్వదన్వయాం
భోనిధిపూర్ణచంద్రుఁ డగు పుత్రనిధానము నిన్నుఁ గంటిఁ బెం
పూనఁగ నింక నిన్ను మహిమోన్నతిఁ బట్టము గట్ట ధన్యతన్.

8


మ.

విను మెల్లుండి దినంబు లెస్స నిఖలోర్వీచక్రరక్షాభరం
బున కీ వెల్లి ధరాసుతాసహితుఁ డై పుణ్యోపవాసంబు గై
కొని నేమంబున నుండు పొమ్మనుచు వీడ్కొల్పెన్ గుణాలంకరి
ష్ణుని భూయిష్ఠవరిష్ఠనిష్ఠురరణానుష్ఠాననిష్ఠాపరున్.

9


వ.

అంత నక్కుమారుండునుం దననగరి కరిగి యథోచితాచారంబులు నియతుండై
యుండె నప్పు డప్పురంబునం జతురశిల్పంబులు నెరయం గనకసాలభంజికలం
దగినయెడలం దీర్చి వింతరచనలు గూర్చి వివిధమణిరాజితానేకమకరతో
రణాలంకృతం బగుచుం దేజరిల్లు రాజమార్గంబులును నారాజమార్గంబుల రఘు
రాజన్యవిజయశ్రీలాంఛనంబులు లిఖియించిన రమ్యహర్మ్యతలంబుల నమర్చినం
గల్యాణసమయం బగుచు వచ్చె నీరాజు నీరాజనకరణంబులకు రం డనుచు నమ
రకాంతలఁ బిలుచునోజం గ్రాలు నూతనకేతనంబులును గమనీయహేమదం
డంబుల రామణీయకంబులం దొంగలిగొను కాంచనకల్హారంబును నెలకొల్పఁ
గలయ నెత్తిన నభోభాగంబునం బెడం గడరుకలువడంబులును గెలంకులం దరు
ణరంభాస్తంభంబులు నెలకొల్పి విలసదశ్వత్థచూతపత్రదామంబుల నభిరామంబు
లుగాఁ గట్టి పై రుచిరముకురశ్రేణులఁ గీలించినం జెన్నొందు మందిరద్వారంబు
లును జందనకస్తూరికాకుంకుమజలంబులం గలయంపు లిచ్చి ముక్తాఫలంబుల రంగ
వల్లికలు దీర్చి కుసుమవిసరంబులు నెరపినం బొలు పెసంగు నకలంకరత్నాంకి
తాంగణంబులును నానావిధవిచిత్రవిలాసంబు లొనరించి మనోహరప్రకారం
బులం బాటించినం జెలు వొలయు భవనవాటికలును నభినవాభరణంబులఁ గైసేసి
గంభీరసౌభాగ్యరేఖ లొదవిన ముదంబునం బొదలుచుఁ బసిండిపళ్లెరంబుల శుక్తి
జాక్షతంబులును మాణిక్యదీపకళికలు లోనుగాఁ బరమమంగళోపకరణంబులు చే
కొని యున్న పుణ్యాంగనాజనంబులును బ్రసాధికలునై పుణ్యంబులం గావించు శృం
గారభంగులు గలవిభ్రమంబులంకుం గనుఁబాటు దోఁపకుండఁ జేయుతెఱంగునం
బొలుచు నవ్విశేషలావణ్యకలాకలాపంబుల జగన్మోహనంబు లగుచుం బొలయు
విలాసినీగణంబులును సమస్తభూషణభూషితంబు లగుకరితురగాదులును జెలంగు
పంచమహాశబ్దంబులునుం గలిగి యునికిఁ గైకేయీపరిచారిక యగుమంథర
యనునది యొక్కసౌధం బెక్కి చూచి యిది రామచంద్రునిపట్టాభిషేకమహో
త్సవంబు గాఁబోలు దీనికి విఘ్నంబు గావింపవలయు నని విచారించి తొల్లి కౌస
ల్యాతనయుచేతం దనకు నైనచరణతాడనభంగంబు వైరకారణంబుగాఁ గొని
యక్కేకయరాజపుత్రిపాలికిం జని యి ట్లనియె.

10