85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల
నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో
తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు
పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు
తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు
అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు,
న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు
మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.
ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో
వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా
నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి
మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే
తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు
తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి
కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా
ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల
తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి.
భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన
దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు.
ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి
GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా
కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా
ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు
ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి.
ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం
కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్
ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా
నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల
క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా
కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood
ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు
మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA
గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821
నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921
వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.