Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 84

కంపెనీ నిర్ణయించిన పన్నులను కాకుండా పలు రకాల నూతన పన్నులను విధించారు. ఊపిరి పీల్చుకోలేని విధంగా 52 రకాల పన్నులను అటు కంపెనీకి గాని, ఇటు జెన్మికి గాని రైతులు చెల్లించాల్సి వచ్చింది. ఈ రకమైన ఆర్థిక దోపిడీకి తోడుగా రైతులను భూమి నుండి తొలగించేందుకు జెన్మిలు అక్రమాలకు పాల్పడసాగారు. అర్థాంతరంగా, అకారణంగా పెంచిన కౌలును ఇవ్వలేకపోయిన రైతు నుండి భూమిని బలవంతంగా లాక్కోవడం పరిపాటయ్యింది. జెన్మి కోరినంత పంట భాగం సమర్పించకుంటే నిర్దాక్షిణ్యంగా రైతులను భూమి నుండి గెంటివేయటం నిత్యకృత్యమైంది. కౌలు భూమి ఎంతకాలం తన అధీనంలో ఉంటుందో తెలియని వాతావరణంలో, 'బాంచన్ దొరా' అంటూ రైతులు భారంగా బ్రతుకు సాగించాల్సిన పరిస్థితులు దాపురించాయి. కంపెనీ అధికారులను, పోలీసులను, రకరకాలుగా సంతృప్తిపర్చడం వలన, న్యాయాన్యాయాలతో పనిలేకుండా అధికారులు, న్యాయాధికారులు జెన్మిలకు అనుకూలంగా వ్యవహరించసాగారు. కోర్టు కేసులు, పోలీసు వేధింపుల మూలంగా, కుటుంబానికి తిండి పెట్టడమే పెనుభారంగా మారటంతో, రైతు పరిస్థితి దారుణమైపోయింది. ప్రభుత్వం, చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు, అధికారులు కలసికట్టుగా జెన్మిల పక్షం వహించటం వలన రైతులకు న్యాయం దుస్సాధ్యమైంది. అన్యాయం, అధర్మం, అంతులేని పీడన మోప్లా రైతుల ముంగిట్లో వికృత నృత్యం చేయనారంభించాయి.
ఈ పరిస్థితులు మోప్లాలను నిరసన స్థాయి నుండి తిరుగుబాటుకు, ప్రతిఘటనకు ప్రేరేపించాయి. ఆ కారణంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. తిరుగుబాటు బాటను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులను మలబారు మేజిస్ట్రేట్ H.V. CONOLLY కంపెనీకి పంపిన తన నివేదికలో ఈ విధంగా వివరించాడు. "... The most ready sup- position on hearing of such atrocities committed by the lower on the higher ranks of society is that the people have driven to desperation and force to take the law into their own hands by some intolerable tyranny...".
తిరుగుబాటు ప్రారంభం
భూస్వాముల కక్ష సాధింపు చర్యలు అత్యధికమయ్యాయి. జెన్మిలే కాకుండా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, అధికారులు రైతుల మీద పెత్తందారులయ్యారు. జెన్మిలకు పంట భాగం వసూలు చేసి పెట్టే మధ్యదళారుల జులుం మితిమీరింది. పంట భాగం అందించినా, రసీదు ఇవ్వకపోవటం, చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరిగేది. రసీదులు ఇవ్వకుండా సరిపెట్టి, పన్ను ఎగవేసాడని ఆరోపించి, రైతు మీద కేసు వేసి కౌలు భూములను బలవంతంగా లాక్కోవటం లాంటి కుయుక్తులకు మధ్య దళారులు పాల్పడసాగారు. కౌలు వసూలుకు వెడితే హింసకు దిగారని అసత్య ఆరోపణలు చేసి, తమకు వత్తాసుదారులైన పోలీసుల చేత రైతుల మీద కేసులు నమోదు చేయించి, కటకటాలలో బంధించి కుళ్ళబొడవటం నిత్యకృత్యమయ్యాయి. పంట భాగాన్ని బలవంతంగా వసూలు చేసుకోవటం తప్ప, మిగతా విషయాలు పట్టని జెన్మిలు రైతుల కడగండ్లను పట్టించుకోకుండా కిరాతకంగా వ్యవహరిస్తూ, తమ బలగాలను రైతు కుటుంబాల మీదకు పంపి నానా బీభత్సం సృష్టించి, భయభ్రాంతులు చేయసాగారు.