సయ్యద్ నశీర్ అహమ్మద్ 86
1836 నుండి 1921 వరకు జరిగిన 29 తిరుగుబాట్లు మలబారు రైతాంగ చరిత్రలో
ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఈ పోరాటాలలో అటు జెన్మిల దళాలను, ఇటు పోలీసు, సైనిక బలగాలను,
ఎదుర్కొని వీరోచితంగా పోరాడిన 318 మంది మోప్లాలు కదన రంగంలో శత్రువుతో
ద్వంద్వ యుద్ధంచేస్తూ నేలకొరిగి చరిత్ర పుటలకెక్కారు. శత్రువు చేత చిక్కి చిత్రహింసలకు
గురికావడం అవమానంగా భావించినందున అలవికానిచోట అధికులమనరాదనే, లౌక్యానికి
భిన్నంగా ప్రాణాలు పణంగా పెట్టారు. చివరివరకు ప్రభుత్వ బలగాలతో పోరాడి మరణాన్ని
పొందటం అంతిమ లక్ష్యంగా మోప్లా వీరులు భావించారు. శత్రువుతో పోరాడుతూ కదన
రంగంలో ప్రాణాలు వదలిన వారి సంఖ్య వందల్లో ఉన్నా, మహత్తరమైన ఈ రైతాంగ
పోరాటంలో అనేక కష్టనష్టాలకు గురైన కుటుంబాలు అసంఖ్యాకం. మోప్లా రైతులు అటు
భూస్వాముల కచ్చేరిలలో, దేవిడిలలో, ఇటు ప్రభుత్వ జైళ్ళలో దుర్భర జీవితాలను గడిపారు.
పోలీసు తుపాకి గుళ్ళకు, భూస్వాముల కిరాయి మూకల కరకు కత్తులకు బలయ్యారు.
భూస్వాములు, బ్రిటీష్ పాలకులు ఎంత దుర్మార్గంగా, క్రూరంగా వ్యవహరించినా, దక్షిణ
మలబారు ప్రాంతంలోని సామాన్య పేదా సాదా జనమంతా మోప్లా వీరులకు, తిరగబడ్డ
రైతులకు చివరికంటా అండగా నిలిచారు.
తిరుగుబాట్ల తీరు తెన్నులు
మోప్లా రైతాంగ వీరుల పోరాటం తీరుతెన్నులు విలక్షణమైనవి. భూస్వాములైన
జెన్మిలు, జెన్మిల మద్దతుదారులు, అధికారులు పీడనకు వ్యతిరేకంగా పోరాడటం సాంఘిక
బాధ్యతగా భావించటమే కాకుండా ధార్మిక విధిగా మోప్లాలు నిర్దేశించుకున్నారు. అధర్మానికి,
అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా తమ పవిత్ర గ్రంథం ఆదేశిస్తుందని,
ఆ ఆదేశాల మేరకు పోరాడుతూ మరణం పొందితే స్వర్గం ప్రాప్తిస్తుందని మోర్గాలు నమ్మారు.
పేద రైతు భూమిని ఆక్రమించుకున్న భూస్వామిని మట్టుబెట్టడం ధర్మ సమ్మతమని భావించారు.
ఈ మేరకు మత గురువులైన తంగల్స్ ( మౌల్వీలు-ముల్లాలు ) ప్రచారం చేసారు. ఒకవైపు
భూస్వాముల ఆగడాలు, అధికారుల దాష్టీకాలను సహించలేకపోయిన మోప్లాలు, ఓర్పు
నశించి పోరుబాటను ఎన్నుకున్నారు. ధర్మయుద్ధం చేయటం ధార్మిక విధిగా కొందరు
భావించగా, మరికొందరు స్వర్గప్రాప్తిని ఆశించారు. అణగారిన ప్రజలను, అణచివేతకు
గురవుతున్న ప్రజలను ఆదుకోవటం సాంఘిక, ధార్మిక బాధ్యతగా మోప్లాలు విశ్వసించారు.
ఆనాడు జెన్మిలతో తలపడి అమరత్వానికి అవకాశం చిక్కక శత్రువుచేత చిక్కిన పలువురు
వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
‘... జెన్మిలు నా మీద కేసులు పెట్టి, జైలుకు పంపడాన్ని నేనెటూ నిలువరించలేను.
అరాచకాలను సహించలేను. కొందరు ఆ అకృత్యాలను ఎదుర్కొంటూ అమరులవుతున్నారు.
వాళ్ళతో కలసి నేను కూడా అమరుడిగా అంతం కావాలనుకున్నాను...'
'... అధర్మంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను (జెన్మిలను) హతమార్చుతూ, జీవితాలను
అంతం చేసుకుంటున్న వారు షహీదులవుతున్నారని, వారికి పరలోకంలో ప్రతిఫలం
లభిస్తుందని, ఆ ప్రతిఫలమే స్వర్గమని విన్నాను. ఆ స్వర్గ ప్రాప్తి కోసం నేను కూడా షహీద్