పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ పాత్రను, జాతీయోద్యమంలో ఉద్యమించిన ప్రజానీకం, ఆజాద్‌ హింద్‌ పౌజ్‌లో పాల్గొన్నషేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ లాంటి వారి వివరాలు, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటానికి నాంది పలికిన షేక్‌ బందగీ త్యాగాన్ని ఈ పుస్తకంలో వివరించారు. అసలు చరిత్ర గురించి ఈతరం యువకుల్లో సరైన అవగాహన లేని తరుణంలో నశీర్‌అహమ్మద్‌గారి పుస్తకంలో పేర్కొన్న విశేషాంశాలు వారికి కనువిప్పు కల్గిస్తాయని నా నమ్మకం.

భారతదేశ విముక్తి పోరాటంలో, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏ విధంగా జాతి, మత, ప్రాంత, కుల, వర్గ బేధాలను విస్మరించి సమష్టిగా పోరాడినారో, స్వరాజ్య సాధన అంతిమ లక్ష్యంగా ప్రజలు ఐక్యతను ఏ విధంగా పాించారో సోదాహరణంగా వివరించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రంథకర్త మాటల్లో చెప్పాలంటే 'భిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం' అంతర్గత మార్గదర్శక సూత్రంగా సాగుతున్న భారతీయ సాంఫిుక జన సముదాయాలలో ఒకటైన ముస్లిం జనసముదాయం సోదర జనసముదాయాలతో కలసి మెలసి ఈ పోరులో క్రియాశీలకంగా పాల్గొంది. అది శాంతి పథమైనా, విప్లవ మార్గమైనా ఆత్మార్పణలకు ఏనాడు వెనుకడుగు వేయలేదు.

స్థూలంగా చెప్పాలంటే, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల విభజించి-పాలించు కుటిల నీతిని ధిక్కరించి సామాన్య ముస్లిం ప్రజానీకం మెజారిటీ సముదాయాల వారితో ఐక్యమై స్వాతంత్య్ర సమరంలో మహోజ్వల పాత్రను నిర్వహించిన తీరును ఈ పుస్తకంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇంతవరకు ప్రముఖ ఆంధ్రదేశ చరిత్రకారులు ఆచార్యులు మామిడిపూడి వెంకట రంగయ్య, సరోజిని రేగాని, బయినపల్లి కేశవ నారాయణ లాంటి వారు తమ రచనల్లో తెల్పనటువంటి అనేక విషయాల్ని, సంఘటల్ని, పోరాటయోధుల్ని సమాచారాన్నీ సేకరించి నశీర్‌ గారు ఈ గ్రంథం ద్వారా పాఠకులకు అందించారు.

ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో యిప్పటి వరకు తెలియని కొన్నిచారిత్రక ఘట్టాల్ని ఈ గ్రంథకర్త సోధించి సాధించి అక్షరరూపం కల్పించారు. ఉదాహరణకు భారత దేశంలో 1857 సిపాయీల తిరుగుబాటు అంటే మంగళ పాండే గురించి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ దానికంటే 70 ఏళ్ళకు పూర్వమే 1780లో తెలుగు బిడ్డలు సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ నాయకత్వంలో స్వదేశీ సిపాయిలు తిరుగుబాటు చేసిన వైనం గురించి చరిత్ర పాఠ్యపుస్తకాలలో లేదు. అదేవిధంగాస్వాతంత్య్ర సమరంలో ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ పాత్రను కొనియాడుతూ ఆయనను 'సరిహద్ధు గాంధీ' గా వర్ణించడం జరిగింది. కాని ఆంధ్రప్రదేశ్‌లో 'విశాఖ గాంధీ' గా పేర్గాంచిన విశాఖపట్నం యోధుడు ఫరీద్ధుల్‌ జమాను పరిచయం చేసిన ఘనత నశీర్‌ గారిదే.