Jump to content

పుట:భరతరసప్రకరణము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే దస్యాస్వాద్యత్వమును బొందింపఁబడిన క్రోధస్థాయి రౌద్రరసమని చెప్పఁబడును. ఆతతాయియు, కొండెము చెప్పువాఁడు, పాపము మొదలయినవానిని జేయుమనువాఁడు, క్షేపము అవమానము మొదలయిన ఆక్రోశమును బంధనము వధము మొదలయిన హింసను జేయువాఁడు, ద్రోహముఁ జేయువాఁడును దీనికి ఆలంబనములు. దార్థ్యము, భయము లేకయుండుట, గర్వము, ఔద్ధత్యము, మొదలైన గుణములును, ఎవఁడురా నీవు ఏమి చేయుచున్నావురా అనునవి మొదలయిన క్రూరవాక్యములును, విరోధపుపలుకులు, తలయూచుట, నవ్వుట, వంకరగఁ జూచుట మొదలైనవియు, పెదవి కొఱుకుట, కనుబొమల ముడివేయుట, గ్రుడ్లు ఎఱ్ఱనై గిరగిర తిరుగుట, నేల కొట్టుట, భుజాస్ఫాలనము చేయుట, చేయి కట్టుట, గుద్దు లిడుట, చెక్కిళ్లు అదరుట, ఎఱ్ఱనిముఖకాంతి, చంపెడుయత్నము, భేదించుట, ఈడ్చుట, కొట్టుట, నఱుకుట, వస్త్రమును నదలించుట, మాటలాడుట, దండశస్త్రాదులను గ్రహించుట, పరుగులిడుట, చంపుట, కన్నీరిడుట, నెత్తురు త్రాగుట, మిక్కిలి తఱముట, ఓరి పాపీ, మనుష్యపశువా, ద్రోహి, నిలువు నిలువు, ఎచటికిఁ బోయెదవు, నీతల పగులఁగొట్టెదను, ఱొమ్ము చీల్చెదను, దంతములు రాలఁగొట్టెదను, దేహము నలియఁగొట్టెదను, ఇవి మొదలైనపలుకులును, భయము లేక యుండుట, సాత్వికము లేక యుండుట, అనుభావము లౌను. అమర్షము, మదము, స్మృతి, ఔత్సుక్యావేగములు, మోహము, గర్వము, ఈర్ష్య, చాపలము, ఉగ్రత ఈసంచారిభావములును గలవు.

రసాద్రసోత్పత్తిర్యథా

హాస్యో భవతి శృంగారాత్కరుణో రౌద్రకర్మణః
అద్భుతశ్చతథావీరాద్బీభత్సాచ్చ భయానకః.

395

శృంగారరసమువలన హాస్యరసము గలుగుచున్నది. రౌద్రరసమువలన కరుణరసము గలుగుచున్నది. వీరరసమువలన అద్భుతరసము గలుగుచున్నది. బీభత్సమువలన భయానకరసము కలుగుచున్నది.