ఆస, ద్వేషము, మొదలైనవానిచే మనస్సులోఁ గలుగు లాఘవము చాపల మౌను. అందు యోచింపక కౌగిలించుకొనుట, చూచుట, వెళ్లుమనుట, కఠినపుమాటలు, కొట్టుట, ఆజ్ఞాపించుట మొదలైనచేష్టలు గలుగును.
హర్షలక్షణం
| మనోరథస్య లాభేన సిద్ధియోగ్యస్య వస్తునః, | 176 |
| మనఃప్రసాదో హర్షస్స్యాదత్ర నేత్రాస్యఫుల్లతా, | 177 |
| స్వేదోద్గమశ్చ హస్తేన హస్తసంతాడనాదయః, | |
మనోరథముయొక్క సిద్ధియోగ్యమైనవస్తువుయొక్క లాభముచేతను, మిత్రుల సంగమముచేతను, దేవతాదులప్రసాదముచేతను గలిగింపఁబడిన మనఃప్రసాదము హర్ష మనఁబడును. ఇందు ముఖము కన్నులు వికసించుట, ప్రియము పలుకులు, కౌఁగిలించుట, పులకరించుట, చెమట గలుగుట, చేతులు తట్టుట మొదలైనవి గలుగును.
ఆవేగలక్షణం
| చిత్తస్య సంభ్రమో యస్స్యాదావేగో౽యం స చాష్టథా. | 178 |
| ఉత్పాతవాతవర్షాగ్నిమత్తకుంజరదర్శనాత్, | 179 |
మనసుయొక్క తడబాటు ఆవేగమౌను. ఆయావేగము ఉత్పాతావేగమనియు, వాతావేగమనియు, వర్షావేగమనియు, అగ్న్యావేగమనియు, మత్తకుంజరదర్శనావేగమనియు, ప్రియశ్రవణావేగమనియు, అప్రియశ్రవణావేగమనియు, శాత్రవవ్యసనావేగమనియు కారణానుసారముగా నెనిమిదితెఱఁగు లగును.