ఉత్పాతావేగో యథా
| తత్రోత్పాతస్తు శైలాదికంపకేతూదయాదయః, | 180 |
అందు కొండ మొదలైనవి కదలుట, తోఁకచుక్క పుట్టుట మొదలైనవి ఉత్పాత మాను. దీనివలన గలిగిన సర్వాంగవిస్రంసము, వైమనస్యము, అపసర్పణము ఇవి ఉత్పాతావేగ మనఁబడును.
వాతావేగో యథా
| త్వరయా గమనం వస్త్రాహరణం చాపకుంఠనం, | 181 |
వేగముగ నడచుట, వస్త్రములను తీసికొనుట, కప్పుకొనుట, కన్నులను తుడుచుకొనుట మొదలైనవి పెద్దగాలిచేఁ గలుగు క్రియయలు.
వర్షావేగో యథా
| ఛత్రగ్రహో౽౦గసంకోచబాహుస్వస్తికధావనే, | 182 |
గొడుగును గ్రహించుట, దేహము చిన్నదవుట, చేతులను భుజమూలములయందుఁ జేర్చుట, పరుగిడుట, గుప్తస్థలము నాశ్రయించుట మొదలైనవి వర్షావేగముచేఁ గలుగు క్రియలు.
అగ్న్యావేగో యథా
| అగ్న్యావేగభవాశ్చేష్టా వీజనం చాంగధూననం, | 183 |
అగ్న్యావేగమందుఁ గలుగుచేష్టలు వీజనము, అంగధూననము, వ్యత్యాసముగ నడుగులుంచుట, నేత్రసంకోచము ఇవి మొదలైనవి.