పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91. క. జ్ఞానం బన యోగం బనఁ
గానఁగవలె నొకటికొకటి కావడికుండల్‌
పూనిక 1నొక్కట నిలువదు
భానునుతా శివముకుంద పరమానందా.

92. క. ఈకంటఁ జూడ లేఁడట
యేకంటను జూచుటింక నెఱుఁగుట యేలా
గాకన్నే యీకన్నౌ
ప్రాకటముగ శివముకుంద పరమానందా.

93. క. ఈకనుచూ పాకనుచూ
పేకంబై నిండి నిండి హెచ్చిన సుఖమౌ
వాకునఁ జెప్పఁగ వశమా
ప్రాకటముగ శివముకుంద పరమానందా.

94. క. దృశ్యము కూడిన తెలివి య
వశ్యము బంధంబుసుమ్ము వర్ణింపంగా
దృశ్యముఁ బాసినతెలివి యు
పాస్యం బది శివముకుంద పరమానందా.

95. క. బంధములగు కర్మంబులు
సంధింపక దృశ్యములను జ్ఞానాగ్నికిఁ దా
నింధనములు సేయఁగవలె
బంధురగతి శివముకుంద పరమానందా.

96. క. చెన్నుగ దీపముఁ జూడఁగ
నెన్నగఁ వేఱొక్కదీప మేఁటికిఁ జెపుమా
తన్నుండే తనుఁ గనవలెఁ
బన్నుగ నిఁక శివముకుంద పరమానందా.

97. క. అజ్ఞాని యొకఁడు గల్గఁగ
సుజ్ఞానిఁగఁ జేయవలసె సుజ్ఞానైతే
సుజ్ఞాని నేల చేయను
ప్రాజ్ఞుఁడనా శివముకుంద పరమానందా.
1 యొక్కటి