పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుండును నదియే కన్నుల
పండు వయా శివముకుంద పరమానందా.

84. క. యెఱిఁగినయది జడిమంబగు
యెఱుకవిడన్‌ శూన్యమగును యెఱుకే యెఱుకై
నిరతిశయానందం బగు
పరమాత్మా! శివముకుంద పరమానందా.

85. క. కన్నది కన్నట్టే చనె
విన్నది విన్నట్టె యణఁగె వినకే కనకే
యున్నది యే నై యుంటిని
బన్నుగ నిఁక శివముకుంద పరమానందా.

86. క. కన్నది విన్నది గాకే
యున్నది తుదముట్టఁ గంటి నోహో! యిది నే
నెన్నఁడు నెఱుఁగనిదే సం
పన్నత యో శివముకుంద పరమానందా.

87. క. మాటల సందెడు నిడఁగను
తాటోటులు గాక దానఁ దత్త్వంబగునే
మాటల తత్త్వము లవి పరి
పాటిగదా! శివముకుంద పరమానందా.

88. క. మేదినిఁ గుజనులు ఘనులతొ
వాదింతురు నిజముఁ గన్నవారింబలెనే
యేదైనను దూషణ సం
పాదింతురు శివముకుంద పరమానందా.

89. క. కోటివగవిద్య లెల్లను
కూటికిఁ గా కాత్మవిద్యకును సరియగునే
బూటకము లనక కుజనులు
పాటింపరు శివముకుంద పరమానందా.

90. క. యోగంబందురు కొందఱు
యోగముగా జ్ఞానమందు రొగిఁ గొంద ఱిలన్‌
యోగజ్ఞానంబులు సమ
భాగంబులు శివముకుంద పరమానందా.