పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. దేవపూజల గొడవేల? తీర్థమేల?
చెలఁగి యష్టాంగయోగముల్‌ సేయనేల?
గురుముఖంబున క్షణములో గుఱియు గనిన
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

7. తన్నుఁదెలిసిన మఱివేఱె తనకు లేదు;
తన్నుఁదెలిసిన బ్రహ్మమై తాను నిలుచు
తన్నుఁ దెలిసిన సద్గురూత్తముని వలన
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

8. సద్గురువు గల్గునటమీఁదఁ జదువులేల?
నిజమెఱింగినపిమ్మట నిష్ఠలేల?
సర్వమును దానయై యున్నసరణి గాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

9. తత్పదంబును నదియపో 'త్వం'పదంబు,
అసిపదంబును నీరెంటి కైక్యమగును;
దెలియు శివయోగి, మూఢుండు దెలియలేఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

10. సకలనైష్ఠికములు గాదు, శక్తిగాదు,
జీవుఁడును గాదు, పరమునై చెలఁగు బ్రహ్మ
మద్భుతానంద మైనట్టి యనుభవంబు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

11. రూపులకునెల్ల రూఢియౌ రూపు గాక,
వెలుఁగులకునెల్ల వెలుఁగునై వెలుఁగుఁగాక
చెలఁగు ననుభవవేద్యమై చిద్ఘనంబు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

12. లోను జూడంగఁ జూడంగ లోనుగాదు;
బయలు చూడంగఁ జూడంగ బట్టబయలు;
బైటలోపలఁ బూర్ణుఁడై పరఁగుశివుఁడు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.