పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు


సదానందయోగి శతకము



1. శ్రీమహోన్నత విజ్ఞాన సిద్ధి నొసఁగు
సద్గురుస్వామి పాదాంబుజములు తలఁచి
సకలతత్త్వార్థ సంగతుల్‌ సంగ్రహించి
గీతశతకంబు రచియింతుఁ గీర్తి వెలయ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

2. ధరణిలోపలఁ దనరారు తత్త్వములకు
నవ్వలై యున్న తత్త్వంబు నెవ్వఁ డెఱుఁగు
శివుఁడు గురురూపమై వచ్చి చెప్పకున్న
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

3. పుట్టుచావులు రెండును బొరయనట్టి
నిర్మలజ్ఞానసంపన్ననిష్ఠ గలుగు
తెరువుఁ గల్పించునాతఁడె గురువరుండు
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

4. బట్టబయలైన యీ పరబ్రహ్మమహిమ
దేశికస్వామికృప లేక తెలియరాదు
యెన్నిచదువులు చదివిన నేమిఫలము?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

5. సకలశాస్త్రంబు లెల్లను చదువువారు
చదువుకోనట్టివారితో సమముగాదె,
గురుముఖంబున ననుభవం బెఱుఁగకున్న?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.