పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. శివుఁడు జీవుండు రెండువస్తువు లటంచు
నిచ్చ నెంచిన సాయుజ్య మెట్లు కల్గు?
శివశివా భేద మన్నది సేయరాదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

14. నీట వెలసినలవణంబు నీటఁ గలియు
నీరు గాకుండ దారీతి నిశ్చయముగ;
శివుని దలఁచిన జీవుండు శివుఁడు గాఁదె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

15. సత్తు నెఱుఁగ దసత్తు దా జడముగాన,
సత్తసత్తువు నెఱుఁగ బ్రసక్తి లేదు;
అట్టి సదసత్తు లెఱిఁగెడి దాత్మ సువ్వె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

16. సత్తుఁ గూడినయపుడెల్ల సత్తె యౌను;
సత్తు లోఁగూడ మఱి తానె సత్తు వౌను;
గాన జీవుండు సదసత్తుగాఁడె తలఁప?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

17. సూర్యదివసాదికంబులు చూచుకొన్న
నాస్పదంబును బుద్ధికి నాస్పదంబు,
పెక్కుభ్రమలను నెందుకుఁ జిక్కినారు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

18. కలదు కల దన్నవారికి కలదు జగము;
లేదు లే దనువారికి లేదు జగము;
కలిమిలేములు మాయకుఁ గలగుణములు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

19. మతము లెన్నైనఁ గలవు భూమండలమున;
మతము లన్నియు సామాన్యమాయ సువ్వె;
మతము విడిచిన మదికి సమ్మతము గాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.