పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి
చెంతఁ జేరఁగఁబోను శేషశయన!
తే. పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 4

సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు
ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టఁగలేదు
పల్ల కిమ్మని నోటఁ బలుకలేదు
సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వఁగలేదు
భూము లిమ్మని పేరు పొగడలేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగాలేదు
పసుల నిమ్మని పట్టుపట్టలేదు
తే. నేను గోరిన దొక్కటే నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 5

సీ. మందుఁడనని నన్ను నిందఁ జేసిననేమి?
నా దీనతను జూచి నవ్వనేమి?
దూరభావములేక తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంకఁ బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి?
చేరి దాపట గేలిచేయనేమి?