పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. కల్ప వృక్షమువలె నీవు గల్గనింకఁ
బ్రజల లక్ష్యంబు నాకేల?పద్మనాభ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 6

సీ. చిత్తశుద్ధిగ నీకుసేవఁజేసెదఁ గాని
పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు
జన్మపావనతకై స్మరణఁజేసెదఁ గాని
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు
ముక్తికోసము నేనుమ్రొక్కి వేఁడెదఁ గాని
దండి భాగ్యము నిమిత్తంబుఁ గాదు
నిన్నుఁ బొగడఁగ విద్యనేర్చితినే కాని
కుక్షినిండెడి కూటికొఱకుఁ గాదు
తే. పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ
గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 7

సీ. శ్రవణ రంధ్రముల నీసత్కథల్‌ పొగడంగ
లేశ మానందంబు లేనివాఁడు
పుణ్యవంతులు నిన్నుఁబూజసేయఁగఁ జూచి
భావమం దుత్సాహపడనివాఁడు
భక్తవర్యులు నీ ప్రభావముల్‌ పొగడంగఁ
దత్పరత్వములేక తలఁగువాఁడు
తనచిత్తమందు నీ ధ్యానమెన్నఁడు లేక
కాలమంతయు వృథాగడుపువాఁడు
తే. వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును
మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 8