పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: సహస్రారచక్రనిర్ణయము :-
60. సీ. సరససహస్రారచక్రంబు మూర్ధస్థ
లం బందు యుండు విలక్షణముగ
నందువేరేకు లింపొందుగా వర్తించు
సాక్షిభూతము సహజాత్మశక్తి
ఓంకారబీజము ఝుంకారనాదము
బహుచిత్రవర్ణముల్ పరమభక్తి
నమృతంబు నెప్పుడు నతివృష్టి గురియంగ
హంసలు దశశతం బాడుచుండు
గీ. నందు నిరుపమసచ్చిదానందముగను
నీవుసద్గుణరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

61. సీ. కొండమీదను పెద్దగుండు నొక్కటియుండు
గుండునడుమను నల్లగుండ్లు రెండు
గుండ్లుమధ్యను నక్క కూఁత లెట్టుచునుండు
కూఁతలనడుమను నూతియుండు
నూతిమధ్యంబున నాతియొకతె యుండు
నాతిమీఁదను నొక్కకోఁతి యుండు
కోఁతిమీదను బరంజ్యోతి వెల్గుచునుండు
జ్యోతియే జగమెల్లఁ జూచుచుండు
గీ. జూచుచుండెడి దానెందు చోద్యమెరిగి
నదియు తా నన యున్నవాఁ డాత్మవిదుఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.