పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: విశుద్ధచక్రనిర్ణయము :-
58. సీ. తాలుమూలలయందు స్థానంబుగా విశు
ద్ధాంభోజ ముండు సుందరముగాను
పదియారుదళములు బాగుగా షోడశ
స్వరము లుండును పరాశక్తియుండు
స్ఫటికవర్ణం బందు స్వానందభక్తియు
నాకాశభూతంబు నమరియుండు
మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగ
హంసలు దశశతం బాడుచుండు
గీ. భాసురంబుగ నానందభరిత మగుచు
నీవు యీశ్వరరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: ఆజ్ఞాచక్రనిర్ణయము :-
59. సీ. నాసాగ్రవీథిని నయనద్వయంబుల
నడుమ నాజ్ఞేయంబు నమరియుండు
రెండురేకులు దానికుండు మీదను రెండు
హంక్షంబు లనియెడి యక్షరములు
నద్భినాదంబు మహాతత్వభూతంబు
మాణిక్యకాంతి సమరసభక్తి
గంగాసరస్వతీసంగమస్థానంబు
హంసలు పదినూర్లు నాడుచుండు
గీ. శ్రీకరంబుగ నట సదాశివవిలాస
రూపమైనావు నీవు నిరూఢముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.