పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: పరమాత్మస్థాననిర్ణయము :-
62. సీ. విమలచిన్మయనేత్రకమలమధ్యంబున
మార్తాండసోమాగ్ని మండలములు
మండలంబులయందు మహనీయముగ నొక్క
నీలమేఘం బుండు నిజముగాను
మేఘమధ్యంబున మెరుపుమెరయుచు నుండు
నందు నీవారశూకాగ్ర ముండు
శూకాగ్రమున నతిసూక్ష్మస్వరూపమై
బహిరంతరంబులఁ బ్రజ్వరిల్లి
గీ. వెలుఁగుచున్నాఁడ వేకమై వెరపులేక
నిర్మలాకార నిరుపమ నిర్వికార
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: ప్రకృతిలక్షణము :-
63. సీ. జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు
ప్రాణాదు లైదు శబ్దాదు లైదు
ఘనమనోబుద్ధ్యహంకారచిత్తంబులు
నాల్గును నిరువదీనాల్గుతత్త్వ
ములఁగూడి ధవళాశ్యామలరక్తపీతవ
ర్ణములు నాలుగుగల్గిగి నదియె ప్రకృతి
యది క్షరం బది క్షేత్ర మదిజడం బది దృశ్య
మదియ విద్యాజ్ఞాన మదియ నాత్మ
గీ. నదియె జీవంబు నది దేహ మది జగంబు
నదియు సంసార మది బంధ నరక మదియు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.