పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ఉపదేశమయ్యెడుక్రమము :-
48. సీ. సాధనచత్వారిసంపత్తియును గలిగి
పరిపూర్ణుఁ డైనసద్గురినిఁ జేరి
ద్వాదశాష్టాంగదండంబుల నర్పించి
తనుమనఃప్రాణము ల్ధారఁబోసి
భక్తితో నాత్మాంగభావసుస్థాన శు
శ్రుషలుఁజేసి సంతోషపఱిచి
నట్టి శిష్యునిమెచ్చి గట్టిగా గురుమూర్తి
త్రివిధదీక్ష లొనర్చి దివ్యముగను
గీ. హస్తమస్తకసంయోగమంచితముగఁ
జేసి నిజకేవలాత్మోపడేశ మొసఁగు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: ఉపదేశించుక్రమము :-
49. సీ. యమము నియమము నాసనము ప్రాణాయామ
మమరప్రత్యాహారమంచితముగ
ధ్యానధారణసమాధ్యష్టాంగయుతమంత్ర
యోగము లయహఠయోగములను
రాజయోగంబు తారకము సాంఖ్యామాన
సమును ముద్రలు లక్ష్యసాధకములు
వరతత్వమస్యాదివాక్యము ల్జీవేశ్వ
రైక్యసంధానము ల్రాజితముగ
గీ. శిష్యునికిఁ దెల్పి గురుమూర్తి స్థిరముగాను
పూర్ణభావంబుఁ బొందించు బుధులు మెచ్చ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.