పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ధ్యానముద్రమంత్రయోగలక్షణము :-
50. సీ. భూసురుం డెవడైనఁ బుణ్యశీలుఁడు మహా
నదులతోయముల స్నానంబుఁజేసి
శుభ్రవస్త్రముగట్టి శుచియైనస్థలమందుఁ
గ్రమముతోఁ గూర్మచక్రము లిఖించి
దర్భకృష్ణాజినధవళాసనములపై
పద్మాసనస్థుఁడై పదిలముగనుఁ
గన్నులు బిగియించి కడువెన్ను నిక్కించి
నాసాగ్రమునఁ జూపుఁ జూచి మనసు
గీ. కష్టమైనట్టి మంత్రంబు నిష్ఠతోను
జపము సేసినయోగి సజ్జనుఁడు సుమ్మి
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: రాధాముద్రలయయోగలక్షణము :-
51. సీ. ఱెప్పలు వ్రాల్పక రెండుఁజూపులఁ గను
బొమలమద్యమునందుఁ బొందనిలిపి
కర్ణరంధ్రములుఁ గదియంగ బిగియించి
నంతరజ్ఞప్తిచే నాలకించి
గజ్జమువ్వలనాదుఘంటారవము శంఖ
వీణతాళధ్వనుల్వేణుభేరి
మర్ధలమేఘాదిమహనీయదశవిధ
నాదము ల్విని చాల మోదమంది
గీ. నందులోపలఁ దదనాదమందు మనసు
లయముజేసిన యోగి విలక్షణుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.