పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: శమదమాదిషట్కసంపత్తిలక్షణము :-
46. సీ. అంతరింద్రియనిగ్రహంబు శమంబగు
బహిరింద్రియములనిగ్రహము దమము
నపవర్గషట్కంబు లణఁచుట శాంతియు
సుఖదుఃఖములకు నోర్చుట తితీక్ష,
వేదాంతశాస్త్రము ల్విని విమర్శించి స
ద్గురువందు భక్తిగల్గుటయు శ్రద్ధ
కర్మంబులను బ్రహ్మ కల్పించి హృత్పర
బ్రహ్మసంగం బుపరతి యటంచు
గీ. నెఱిఁగి నడచినవాడు యోగిశ్వరుండు
నతడు ముక్తుండు నాద్యుండు నచ్యుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: అరిషడ్వర్గములలక్షణము :-
47. సీ. కోరుట కామంబు కోరినయర్ధంబు
కొనసాగకుండిన క్రోధమగును
వచ్చిన ద్రవ్యంబు వదలకుండును లోభ
మాధనాపేక్ష మోహంబ యగును
ధనమున్నదని మోదమున నుబ్బి నాకేమి
కొదువని గర్వించినది మదంబు
తనద్రవ్య మపహరింతమనెడిజనులందు
మది నీర్ష్యయుంచుట మత్సరంబు
గీ. గనుక నీశత్రువర్గషట్కముల నణఁచి
శాంతిఁ బొందినపురుషుండు సర్వసముఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.