పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: అనాత్మలక్షణము :-
44. సీ. జన్మాస్థివృద్ధులు క్షయపరిణామ నా
శములు షడ్విధవికారముల నాత్మ
ఘనబాల్యయౌవనకౌమారవార్ధక
ములు జాగ్రదాద్యవస్థలును నాత్మ
కమనీయమహదహంకారభూజలహుతా
శనసమీరాంతరిక్షముల నాత్మ
త్రిగుణముల్ స్థూలాదిదేహత్రయములన్న
మయమాదిపంచకోశముల నాత్మ
గీ. యంతరింద్రియబాహ్యేంద్రియముల నాత్మ
దృశ్యరూఅంబు శ్రుతమును దృక్కనాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: సాధనచతుష్టయసంపత్తిలక్షణము :-
45. సీ. సత్యంబు బ్రహ్మం బసత్యంబు సర్వప్ర
పంచంబ యని విమర్శించువాఁడు
ఇహపరసౌఖ్యంబు లిచ్ఛయింపకయుండి
పాపపుణ్యంబులఁ బడనివాఁడు
శమదమంబులు శాంతిశ్రద్ధోపరతితితీ
క్షలు సతతంబును గలుగువాఁడు
మోక్షంబుమీఁద నాపేక్షవిస్తారమై
కాని యేయాపేక్షలేనివాఁడు
గీ. గురుకటాక్షంబుచేతను గురుతెఱింగి
నసిపదం బగునీయందు నైక్యమగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.