Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

73


నింపక దేశపరిపాలనలో ప్రజలకెట్టి అధికారమును పలుకుబడిని కలిగింపక నిరంకుశులై పరిపాలనచేయుట ప్రారంభించిరి. ఇంగ్లాండు .పార్లమెంటులో ఫాక్సుమంత్రి ప్రవేశ పెట్టిన ఇండియా చట్టము చర్చకు వచ్చినప్పుడు 1783 లో సుప్రసిద్ధుడగు బర్కుమహాశయు డీ యాంగ్లేయ పరిపాలనయొక్క స్వరూప స్వభావములను వర్ణించియున్నాడు. “ఆశియాదేశమునుండి భారతదేశమునకు దండెత్తివచ్చిన మహమ్మదీయ జాతివారు మొట్టమొదట చాలా క్రూరచిత్తులై యుండినను వారు కొలదికాలములోనే స్థిరనివాసు లైపోయినందున వారి క్రూర స్వభావమెల్ల అణగిపోయెను. వారి సుఖదుఃఖము లీ దేశముయొక్క బాగోగులతో పెనవేసికొనిపోయెను. నాడీ దేశమున నెలకొనినవారు తమ వంశజులయొక్క భావిజీవితాశయములను భవితవ్యమును శాశ్వతముగా నీదేశమున పాదుకొల్పిరి. వారీదేశముననే తమ జీవితములు గడపి ఇక్కడనే చనిపోయిరి. వీరి స్మృతి చిహ్నములను (గోరీలను) వీరి బిడ్డ లీ దేశముననే గాంచుచుండిరి. శాశ్వతముగా తాము తమపుత్రపౌత్ర పారంపర్యముగా వశింపదలచు భూమి చెడ్డదిగ నుండుట కెవ్వరు నంగీకరింపరు. దారిద్ర్యము, నిస్సారత, పాడువడుట నెవ్వరును చూచి సహింపలేరు. దేశములోని ప్రజ లెల్లరు హాహాకారములు సల్పుచు శాపములు పెట్టుచుండగా వారిమధ్య పుట్టి పెరిగి జీవితము వెళ్ళబుచ్చగలవా రరుదుగ నుందురు. తార్తారు మహమ్మదీయశూరులు, ధనకాంక్షవలనను ఆవేశమువలనను కొంత ధనాపహరణము కొంత ప్రజాపీడనము చేసినను, ఆ