Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

భారత దేశమున


చౌతుపన్ను బలవంతముగా వసూలుచేయుచుండిరి. 1757 లో ప్లాసీయుద్ధము జరిగినపిదప నాంగ్లేయులను జూచిన షా ఆలం చక్రవర్తికిని భయముగనే యుండెను. వారేది కోరిన అది యిచ్చుచుండెను. అందువలననే 1765లో వంగరాష్ట్ర బీహారు ఒరిస్సాల దివానీ యధికారమునిచ్చి ఉత్తర సర్కారులును దక్షిణాపథములును ఆంగ్లేయులకు ఉత్తరసర్కారులకు కర్నాటకమునకు గూడ రాజ్యాధికార పట్టానిచ్చెను. ఇట్లు మొట్టమొదట ఫ్రెంచివారితో కలహముల నెపమున కుట్రలు చేసి దేశీయరాజుల కలహములందు తమకు దమ్మిడీ ఖర్చులేకుండ యుద్ధములలో వచ్చిన రాజ్యభాగమున దోపిడి సొమ్ములో తాముగూడ పంచుకొనగానే మొట్ట మొదటలో నత్యవసరము కలిగినగాని యితరులతో జోక్యము కలిగించుకొన దలపని ఆంగ్లేయ వర్తకులు మానవ రక్తమును రుచి మరిగిన వ్యాఘ్రములై దేశములో విజృంభించిరి.

తమకు సులభముగా లభించిన రాజ్యభాగములందలి ఆదాయమును తాము సుఖముగా అనుభవింపవలెనన్నచో దాని కేమియు నుపద్రవము లేకుండ కాపాడుకొనవలెనుకదా! దానికి కూడ దమ్మిడి ఖర్చులేని ఉపాయము నాలోచించి చుట్టునుండు భూభాగమును తమతో స్నేహముగానుండు ఏ స్వదేశరాజుకో నవాబుకో ఉండునట్లు చూచుచుండిరి. ఒక్కొక్కప్పు డట్టి రాజ్యములు తమకు వచ్చినను దానిని శాత్రవ మధ్యరాజ్యముగా (బఫ్ఫర్ స్టేట్) జేయు కుటిలోపాయము బన్నిరి.