Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

49


"వంగరాష్ట్రము తరుగనిసంపదలకు నిలయమైన భూమి. - దీనియజమానుల నిది ప్రపంచములోకెల్ల ధనవంతులుగ జేయగల భూమి.” ఈ పరిణామము ఎట్లు కలిగినది? తనకాలమున నారాష్ట్రప్రజలు క్రమక్రమముగా ఘోరదారిద్ర్యమున దుస్థితిలో మునుగుచున్నారని గవర్నరుజనరలైన కారన్ వాలీస్ ప్రభువే పలికియున్నాడు. నానాటికి హెచ్చింపబడిన రివిన్యూ శిస్తు వసూళ్ళవలస 1765 కు 1790 కు మధ్య బ్రిటిష్ ప్రభుత్వమువారు తా మంతకంతకు ధనవంతులుకాగా నారాజ్యప్రజ లంతకంతకు దరిద్రులైనారు. దేశము నిర్దనమై పట్టి పోయినది. 1827 లో గవర్నరు జనరలుగ నుండిన లార్డుహేస్టింగ్సు ఇట్లు చెప్పినాడు: (Parliamentary Papers Page 157) "మన చేతికింద నొక క్రొత్తతరమువారు పెరిగినారు. మన శాసనములక్రింద రక్షణక్రింద వ్యాజ్యములు పెరిగినవి. స్పర్ద హెచ్చినది. నీతి క్షీణించినది. న్యాయవిచారణ శాఖవలెనే మనుష్యుల, ఆస్తిరక్షణయు, అతృప్తికరముగా నుండెను." 1851 ఆగస్టు 28 వ తేదీన ఫ్రెండ్ ఆఫ్ ఇండియాలో నొక వ్యాసమున నిట్లు వ్రాయబడినది. “ధనముగలవా డెవ్వడును తెల్లవారులోపల తన ధన మెవరో యొకరు దోచుకొనరను ధైర్యముతో పండుకొనజాలడు. రివిన్యూ (శిస్తువసూలు); న్యాయవిచారణ, పోలీసు మొదలగు అన్ని శాఖలలోను మన పరిపాలన పనికిమాలినదిగ నున్నదని గవర్నరుజనరలు విలియం బెంటికు పలికిన పలుకులలో నతిశయోక్తిలేదు. ఇది బ్రిటిష్ పరిపాలనలోని శాంతి భద్రతలు;సత్పరిపాలన".[1]

  1. England's debt to India - Lajpati Rai.