Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

భారత దేశమున


యోగకరములగు అనేకనిర్మాణములను మీరు స్వయముగా విశేషసొమ్ము ఖర్చుపెట్టి నిర్మించుట మీయందు మాకుగల గౌరవము నినుమడింపజేసి మాకు సంతోషప్రదమైనది”.

ఇట్లీరాజుగారి సత్పరిపాలనమును దానివలన నారాజ్యము పొందుచున్న అభివృద్ధినిగూర్చి బ్రిటిషుప్రభుత్వ మాయనను అభినందించుచున్న కాలముననే తమ పరిపాలనలో జేరిన మూడుకోట్ల ప్రజలస్థితి ఎట్లుండెను? ఫ్రెండ్‌ఆఫ్‌ఇండియాలో 1852 ఏప్రియల్ 1 వ తేదీన డాక్టర్ మార్షమన్‌గా రిట్లు వర్ణించినారు. 'వంగరాష్ట్రములోని రైతుల దుస్థితి ఊహించుటకు గూడ వీలులేనంత ఘోరముగా నున్నదను సంగతి నెవ్వరు కాదనజాలగలరు? ఈ రైతులు కుక్కలు వసించుటకైన తగని గూభ్యముల (hovels) లో నివసింతురు. చింపిరి పేలికలు ధరింతురు. వీరి కుటుంబములలో నెవరికిని రోజు కొకపూటయైన కడుపునిండ భోజనముండదు. వీరికి సామాన్య మానవ సౌఖ్యములైనను లేవు. సాలుకు మూడునాలుగుకోట్లరూపాయల విలువగల పంటను పండించు ఈ రైతుల నిజమైన స్థితిగతులు బయల్పడినచో విన్నవారిగుండె బ్రద్దలైపోవును. బ్రిటిషు పరిపాలనకు పూర్వము నందనవనముగ నుండిన వంగరాష్ట్ర మీ అధోగతి లోనికి వచ్చిన సంగతి స్వయముగా చూచిన వారి వర్ణనమిది. నిజముగా నీ వంగరాష్ట్రము మొదటి నుండియు ఘోరస్థితిలో నున్నచో నీ బ్రిటిషువారు ఈవందసంవత్సరములలో దాని నుద్దరించుట కేమిచేసిరి ! క్లైవుయొక్క పలుకు లింకను లిఖితరూపముగా నిలిచియున్నవి: