94
భారతదేశమున
నొక తనిఖీసభను ఏర్పరచి కంపెనీ వ్యాపారమునకు, పరిపాలనమునకు వేరు వేరు లెక్కలనుంచునట్లు నింక కొన్ని యేర్పాట్లు చేసి 1784 లో పార్లమెంటువారింకొక శాసనమును చేసరి. కాని ఈ దేశమునకు గవర్నరు జనరలు మొదలు చిన్న యుద్యోగివరకు అధికారులను నియమించు హక్కు, దేశాదాయ వ్యయపద్ధతిని పరిపాలనా విధానమున నిర్ణయించు అధికారమును కంపెనీ కే యుండెను. దేశముయొక్క నికరాదాయములనెల్ల కంపెనీ వాటాదారులు లాభములక్రింద పంచుకొనుచుండిరి. ప్రభుత్వస్వరూపమున తరువాత నెన్ని మార్పులు జరిగినను కంపెనీపరిపాలన 1858 లో రద్దుచేయబడు వరకుకూడ నీయన్యాయపు విధానమే అమలు జరుగుచుండెను.
అందువలన నీ దేశమునుండి అమితలాభమును సంపాదించుకొరకు అనేక దుర్మార్గపు పద్ధతులు అవలంబింపబడెను. పన్నులు వసూలుచేయుటకు, కలెక్టరులును, వారికింది యుద్యోగులగుతహశ్శీలుదారు మొదలగువారును తమపోలీసు అధికారములనుపయోగించి రైతులను పీడించుటయేగాక అతిక్రూరము లయిన హింసాపద్ధతులు అవలంబింపసాగిరి. క్రైస్తవమతబోధకులు దేశప్రజలను తమ మతములో కలుపుకొనుటకు కంపెనీ యుద్యోగులతో కుట్రలుచేయసాగిరి. కంపెనీవారి దుష్పరిపాలనము మితిమీరినది. దేశీయరాజులు నవాబులు సింహాసన భ్రష్టులుగ జేయబడిరి. దేశభాగ్యభోగ్యములు కొల్లగొనబడు చుండెను. ఈ అన్యాయములవలన 1845 మొదలు 10 సంవత్సరములు దేశములో తీవ్రమయిన ఆందోళన బయలు దేరినది.