పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

23


III

రాజ్యాంగధర్మ మర్యాద

రాజకీయములందు కాంగ్రెసుయొక్క బలము ప్రదర్శింపబడిన తరుణము త్వరలోనే తటస్థించినది. సంయుక్త రాష్ట్రమునను బీహారులోను మన మంత్రులు దారుణవిప్లవవాదుల నెల్లరిని వదలివేయుచు ఉత్తరువుచేయగా గవర్నరులు దాని కడ్డుపడి గవర్నరుజనరలుచేత రద్దు చేయించిరి.

ఈ దారుణవాదుల సమస్య భారతదేశములో చాలకాలమునుండియున్న సమస్య. 1897 లో నిది ఆరంభమై 1908-09 లో అతి తీవ్రమై 1912 వరకు దీని నణచుటకు ప్రభుత్వమువారు ప్రయోగించిన కఠిన శాసన నియమములు, విధించిన ఉరిశిక్షలు, కఠిన నరకములు, పెట్టిన కుట్రకేసులు, చేసిన సోదాలు భీభత్సములవలన ముఖ్యులు జైళ్ళలోని కంపబడుట వలన లోకమాన్యుడాదిగాగల రాజకీయనాయుకులనుగూడ నిర్బంధములందుంచి సామాన్య ప్రజాభిప్రాయమును, ప్రజల ప్రాతిపదిక స్వాతంత్ర్యములనుగూడ అణచివేసి భీభత్సము చేయుటవలన, కొన్నాళ్ళు ఈదారుణవాదుల కృత్యములందు విరామముకలిగెను.

రౌలటుకమిటీవారి నివేదికవలన దేశములో నీయుద్యమ మెంతలోతుగా వ్రేళ్ళుపారి పాదుకొనినదీ వెల్లడియయ్యెను. 1918 నాటికి 800 మంది నిర్బంధితులుండిరి. నాటినుండి నేటివరకు దారుణకృత్యము లప్పుడప్పుడు జరుగుచునే యుండెను.