Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

భారతదేశమున


పెంపొందినవి. నిర్మాణ కార్యక్రమము నెరవేరుచున్నది. కాంగ్రెసు ఉద్దేశ్యములు సఫలీకృతములగుచున్నవి. దేశములో జాతీయ భావము ద్విగుణీకృతమై కాంగ్రెసు అధికారమున లేని తక్కిన రాష్ట్రములందు కూడ ఈ భావములు ఈ సంస్కరణములు వ్యాపించి కాంగ్రెసు యొక్క అఖిలభారత జాతీయతను సార్ధక మొనరించుచున్నది. నేడు గవర్నరులు గవర్నరుజనరలు బ్రిటిష్ పార్లమెంటువారు కూడ కాంగ్రెసును జూచి గడగడ వణకుచున్నారు. కాంగ్రెసుకొరకు సర్వస్వము త్యజించి కాంగ్రెసు పోరాటములో బాధలనంది తుదకు దేశముకొరకు ప్రాణములర్పించిన ధన్యులగు లోకమాన్య తిలకు, లజపతిరాయి, దాసు, నెహ్రూ, అన్సారీ, ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య డాక్టరు వెలిదండ్ల హనుమంతరావు డాక్టరు సుబ్రహ్మణ్యంగారు మొదలగు మహారథులయొక్కయు అతిరథుల యొక్కయు ఇంకననేక సేనానుల యొక్కయు, బ్రిటిష్ వస్త్ర బహిష్కారమున ప్రాణముబాసిన బాబు గణూలవంటి శాంతిసైనికుల యొక్కయు, పేరులేకుండగనే పనిచేసి దేశమున కాహుతియైన అసంఖ్యాకులగు అజ్ఞాతవీరుల యొక్కయు తపము నేటికి పుష్పించినది. త్వరలోనే ఫలింప గలదనుటకు సందియములేదు. ఈ కాంగ్రెసుపితృ దేవతల యాత్మలు కొంత వరకైన శాంతి జెందుచున్నవనుటలో సందియములేదు.