Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

25


ములు, కుటిలతంత్రములు ప్రయోగింపబడుచుండెను. కప్పము కట్టలేదనియో, యేదో లోపము జరిగినదనియో, ఔరసుడు లేడనియో, నింకేదోమిషపైననో కొందరి రాజ్యములు లాగి కొనుచు దేశమును ఇంగ్లీషుపరగణాలుగా చేయుచుండిరి. ఇట్లు క్లైవు వార౯ హేస్టింగ్సులు ప్రారంభించిన కుటిలరాజ్యతంత్రము అత్యద్భుతముగా ప్రయోగించబడి నేటి బ్రిటిషు పరగణాలును స్వదేశసంస్థానములునుగల బ్రిటిష్ ఇండియా నిర్మించబడెను.

ఆంగ్లేయ వర్తకుల కోపులు కొఠీలు కోటలయ్యెను. వీరి ఫ్యాక్టరీ గుమాస్తాలు కలెక్టరులైరి. వీరి ముఖ్యాధికారులు గవర్నరులైరి. వీరుకాపలా కొరకు పెట్టిన రెండువందల సిపాయీలు రెండులక్షల సైన్యములయ్యెను. వీరి వ్యాపారపు టోడలు యుద్ధనౌకలయ్యెను. చూచుచుండగనే వర్తకముజేసికొను సంఘమువారు దేశపరిపాలకులైరి. స్వతంత్రభారతము బ్రిటిష్ ఇండియాగా మారిపోయెను. ఈమార్పు ఒక్క సారిగా జరుగలేదు. కొన్నియేండ్లలో జరిగినది. బలవంతముగా గాక అప్రయత్నముగా జరిగినట్లు జరిగినది. 1857 వరకు కంపెనీపరిపాలనకాలమున భారతదేశము నిజమునకు బ్రిటిషుఇండియాగా నున్నను సిపాయి విప్లవా నంతరము 1858 లో ఆంగ్లరాజమకుటము క్రింద పాలితరాజ్యముగా ప్రకటింపబడిన పిదపనే ఇది సాక్షాత్తుగా బ్రిటిష్ రాజ్యమైనది.