26
భారత దేశమున
II
బ్రిటిష్ ఇండియా నిర్మాణచరిత్ర
బ్రిటిష్‌వారు రాజ్యాధిపత్యము సంసాదించు నప్పటి కింకను దేశము నిమిత్తమాత్రముగా మొగలుచక్రవర్తిక్రిందనే యుండెను. గాని వివిధభాగములను పరిపాలించు రాజులు నవాబులు స్వతంత్రులుగ నుండిరి. ఉత్తరమున వంగరాష్ట్రము, బీహారు, ఒరిస్సాపరగణాలు వంగరాష్ట్ర నవాబుక్రింద నుండెను. అతని ముఖ్యపట్టణము మూర్షిదాబాదు. అయోధ్య, నవాబు వజీరుక్రింద నుండెను. ఇతనిక్రింద కాశీరాజు మొదలగు అనేక సామంతు లుండిరి. మొగలు సామ్రాజ్య రాజధానియగు ఢిల్లీలోను రాజపుత్రస్థానము మధ్యరాష్ట్రములు పశ్చిమకనుమలందును మహారాష్ట్రుల యాధిపత్యముండెను. దక్షిణహిందూస్థానమున హైదరాబాదునవాబు పరిపాలనక్రింద ఆర్కాటు నవాబు, తంజావూరు రాజు, మైసూరుసంస్థానము నుండెను. పశ్చిమోత్తర హిందూదేశము మొగలుచక్రవర్తి పరిపాలనలోనే యుండెను. బ్రిటిషువారు నెలకొనునప్పటి కీభాగము శిక్కులక్రిందికి వచ్చెను. వారినుండి బ్రిటిషువారు దీనిని లాగికొనిరి. సింధురాష్ట్రము అమీరులక్రింద నుండెను.
ఈ విశాలదేశము బ్రిటిషువారి అధికారముక్రిందికి వచ్చిన కథ చాల చిత్రమయినది. ఎట్లువచ్చినదో దక్షిణ హిందూదేశమునుండి చూతము.