పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

426

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మంత్రులను బొమ్మలవలె కూర్చుండబెట్టవచ్చును. ఇంగ్లాండు మొదలగు స్వతంత్ర ప్రజాప్రభుత్వములందువలె ఈ దేశముయొక్క పరిపాలనమంతయు ప్రజాప్రతినిధులకు బాధ్యులగు మంత్రులవలన జరుగునట్టి రాజ్యాంగ మర్యాద యిచటలేదు. తుదకు సామాన్యపరిపాలనమైనను గవర్నరుజనరల్ గవర్నరుల యాటంకములులేకుండా మన మంత్రులు జరుపగలుగు అవకాశములుకూడలేవు. కావున నీ దేశముయొక్క సామాన్య పరిపాలనమైనను మంత్రుల యిష్టానుసారముగా జరుగునని బ్రిటిష్ ప్రభుత్వమువారు వాగ్దానము జేయువరకును లేదా అట్టి నమ్మకము కలుగ జేయువరకును మంత్రిపదవులు స్వీకరింప వీలులేదని 1937 మార్చిలో తీర్మానింపబడెను.

బ్రిటిషుప్రభుత్వమువారు మొదట బెట్టుచేసి కొన్ని కీలుబొమ్మలను మంత్రులనుగా నియమించి తమ యేలుబడిని సాగించిరికాని ఈ విపరీతపు ప్రభుత్వ పద్ధతినిగూర్చి యీ దేశములోను ఇంగ్లాండులోనుకూడ గొప్ప అలజడికలిగి గాంధిమహాత్ముడును కాంగ్రెసువారుసు కోరునది న్యాయమేయను భావము ప్రజలలోను రాజ్యనీతిజ్ఞులలోను వర్ధిల్లగా కాంగ్రెస్‌వారి అపోహలను తొలగించునట్లుగానే గవర్నరులు ప్రవర్తింపగలరని బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రకటించిరి. అంతట 1937 జులైలో కాంగ్రెసు మంత్రిత్వము స్వీకరించెను. ఏడు రాష్ట్రములందు కాంగ్రెస్ మంత్రు లధికారము వహించుటతో భారతదేశమున నొక నూతనయుగము ప్రారంభమైనదని చెప్పవచ్చును.