Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ ప్రభుత్వోదయము

423


కలిగెను. చచ్చిపోయిన దనుకున్న కాంగ్రెసు మరల జీవించుటయెగాక ద్విగుణీ కృతమైన బలముతో తేజముతో పనిచేయ సాగెను.

III

ఇట్టిస్థితిలో భారతదేశదాస్యమును శాశ్వతముగా నొనర్చు నూతన ఇండియా రాజ్యాంగచట్టము 1935 డిశంబరులో శాసనముకాగా దేశములోని రాజకీయపక్షములన్నియు ఈ క్రొత్త రాజ్యాంగమును తిరస్కరించుటలో కాంగ్రెసుతో నేకీభవించెను. కాంగ్రెసు కేవలము తిరస్కార-తీర్మానములతో తృప్తి చెందక ఈ ఆన్యాయపు చట్టమును భగ్నము చేయుటకు దీక్షవహించి అందుకొరకు పనిచేయసాగెను. బ్రిటీషు సామ్రాజ్యము వారీ నూతన రాజ్యాంగమును 1937 ఏప్రియల్ 1 వ తేదీనుండి రాష్ట్రములందు అమలులో పెట్టదలచి దానికి వలసిన సన్నాహములు చేయసాగిరి. సాధారణముగా కాంగ్రెసువారు ఎన్నికలలో పాల్గొనరనియు, పాల్గొనినను తామునెలకొల్పిన ప్రత్యేక నియోజకవర్గములవల్ల జాతీయవాదులుగాక ఒండొరులతో వైరము కలిగియుండు జాతిమతవర్ణములవారి యభిమానులే శాసన సభలలోనికి వచ్చి ఒండొరులతో కలహించి తమ్మాశ్రయించి యుందురనియు తమపరిపాలనావిధానమునకు అడ్డు కలిగింప జాలకుందురనియు వారి యాశ.

రాజకీయ దాస్యమును, ఆర్థిక దారిద్ర్యమును చిరస్థాయిగా చేయగల ఈ రాక్షస రాజ్యాంగము నెదుర్కొనుటకును భగ్నము చేయుటకును కాంగ్రెసు తీవ్రముగా ఆలోచించి రాష్ట్రీయ