పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

422

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


లూడ్చి పెట్టుకొనిపోయెను. కాంగ్రెసుకు అఖండజయము చేకూరెను. కాంగ్రెసు ఎన్నికలందు జయముగాంచి శాసనసభలో ప్రవేశించి రాజ్యాంగధర్మబద్ధమగు పోరాటము చేయసాగెను. ప్రభుత్వమువా రనేకవిషయములందు ఓడిపోవసాగిరి. అనేక అడ్జర్‌న్‌మెంటు తీర్మానములు చేసి ప్రభుత్వముపైన తమకు విశ్వాసములేదని శాసనసభవారు ప్రకటింపసాగిరి. ఆర్థికవిషయములందు బ్రిటిషుప్రభుత్వము గావించుచున్న అన్యాయములు “ఒటావా" ఏర్పాటు నిరసింపబడుటలో బయల్పడెను. కాంగ్రెసును అణచివేసితి నని విల్లింగ్డన్ పలికిన పలుకులు ప్రగల్భము లని తేలెను.

1935 వ సంవత్సరము భారతదేశ చరిత్రలో శాశ్వతముగా స్మరింపదగినది. నాటికికాంగ్రెసు పుట్టి 50 వత్సరములు. కాంగ్రెసు దేశమునకు చేసినసేవకు దేశీయులెల్లరు కృతజ్ఞులై భక్తి విశ్వాసములతో సువర్ణోత్సవము జరుప నిశ్చయించిరి. 1935 డిశంబరు 28 వ తేదీన అఖండ వైభవముతో నీయుత్సవము జరిగెను. భారతదేశములోను ప్రపంచములోను కాంగ్రెసుకుగల గౌరవమును పలుకుబడియు ఈ యుత్సవమువల్ల వెల్లడియయ్యెను. నలుముఖములనుండి అభినందనములు వచ్చెను. ఈ సువర్ణోత్సవ సందర్భమున కాంగ్రెసుసభవారే ప్రకటించిన కాంగ్రెసు - చరిత్రను రచించు భాగ్యము ఆంధ్రుడగు డాక్టరు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారికి కలిగెను. ఈసువర్ణోత్సవమువలన దేశము గొప్ప ప్రబోధమందెను. ప్రభుత్వమువారికి చాల ఆశాభంగము