374
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
నిర్బంధ విధానమునకు తోడ్పడజేయవలయు నన్నచో ఏవో కొన్ని స్వల్పపు రాజకీయ సంస్కరణములు జేసి వీరికి కొన్ని గౌరవబిరుదులును గౌరవోద్యోగములను ఒసగి తృప్తిపరచుట యావశ్యకమని నాటి రాజప్రతినిధియగు మింటో ప్రభువును ఇంగ్లాండు రాజ్యాంగమంత్రి మార్లే ప్రభువును నిశ్చయించిరి. తమ గులాములగు నీ జమీందారులకును ఈ మితవాదులకును ప్రాతినిధ్యము నొసగగల శాసనసభలను నిర్మించినచో, వీరి సలహాతోనే తమ నిరంకుశ పరిపాలనమును జరిగింప వచ్చుననియు తలచి ఒక రాజ్యాంగసంస్కరణము జేయదలచిరి.
మూడవ ప్రకరణము
హోంరూలు - స్వరాజ్యోద్యమము
తానొకటి తలచిన దైవమొకటి తలచునను సామెత నిజమైనది. మింటోమార్లే సంస్కరణములు ప్రసాదించిన రాజ్యాంగము నిరుపయోగమే యైనను, దేశములో రాజకీయ విజ్ఞానము కలిగించుట కిది ప్రజల కుపయోగపడెను. దీనిలో చేయబడిన తీర్మానములు, జరిగిన చర్చలు, బ్రిటీషు రాజ్యతంత్రముయొక్క ఆర్థికలాభవిధానమునుగూర్చియు పరిపాలనా పద్దతినిగూర్చియు గోఖలేగారు చేసిన తీవ్రవిమర్శనములు ప్రజలలో గొప్పసంచలనము కలిగించెను. శాసనసభలందు వేయబడిన ప్రశ్నలవలన అనేకసంగతులు, ప్రభుత్వ రహస్యములు, బయల్పడి ప్రజల రాజకీయ పరిజ్ఞానము వర్ధిల్లెను. 1917 నాటికి గవర్నరు జనరలు సభలో 168 తీర్మానములు చేయబడెను.